12 కార్పోరేషన్లకు పాలక వర్గాలు
– ఒక్కో గ్రామాన్ని ప్రజాప్రతినిధులు దత్తత తీసుకోండి
– శాసనసభపక్ష సమావేశంలో కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 12 (జనంసాక్షి): 12 కార్పోరేషన్లకు పాలక వర్గాలు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండలానికి ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తెరాస శాసనసభాపక్ష సమావేశంలో ఆయన గ్రామజ్యోతిపై సవిూక్షించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెరాస మండల, గ్రామ కమిటీలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నాయకులను ఆదేశించారు. మార్కెట్ కమిటీల పోస్టులకు సామాజిక సవిూకరణలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు త్వరగా ఇవ్వాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో 12 కార్పోరేషన్లకు త్వరలోనే పాలకవర్గాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రజాప్రతినిధులు చురుగ్గా వ్యవహరించాలని కేసీఆర్ సూచించారు. గ్రామజ్యోతిలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ఈ నెల 17 నుంచి 23 వరకు గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇదిలావుంటే గ్రామజ్యోతిని పార్టీ పటిష్టానికి ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. అభివృద్ధి జరిగితే ప్రజలే మనవైపు వస్తారని ఆయన పునరుద్ఘాటించారు. శ్రావణ మాసంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుందని చెప్పారు. దిక్కుమాలిన సమ్మెలు అంటూ తాను చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ సమర్థించుకున్నారు. ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలనుకోవడం బాధాకరమని కేసీఆర్ చెప్పారు.