12 శాతం రిజర్వేషన్ ప్రకటన చేయకపోతే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ
టేకులపల్లి, సెప్టెంబర్ 16( జనం సాక్షి ): తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జరగబోయే సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ప్రకటన చేయకపోతే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరించింది. తెలంగాణ గిరిజన అమరుల త్యాగాలు, బలిదానాలు ఒక్క గిరిజన భవన్ కోసమెనా అని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు శేషు రామ్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భూక్య లాలు నాయక్ అన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి ఎనిమిది సంవత్సరాల పాలనలో గిరిజనులకు చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.6 నుండి 12 శాతం గిరిజన రిజర్వేషన్ ఇప్పించలేని, ఉద్యోగ నియామకాలు చేయించలేని,రాజ్యాంగపరంగా దక్కిన రక్షణ చట్టాలు అమలు చేయించలేనీ జీవోలను అమలు, వనరులు పరిరక్షించలేని, గిరిజన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలన్నారు. తెలంగాణలో గిరిజన అమరుల త్యాగాలు బలిదానాలు అపహాస్యం చేస్తున్నారని, గిరిజన ఉద్యమాలను ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు పాల్గొన్నారు.