తెలంగాణ ఏర్పాటుకు 12 నుంచి ఆందోళన


ఆంధ్రా డబ్బా ఎన్‌టీవీ చూడొద్దు.. చర్చలకు వెళ్లొద్దు
తెలంగాణ టీడీపీ నోరెందుకు మూసుకుంది
కాంగ్రెస్‌ నేతలు మాట్లాడాలి
ఉదాసీనంగా ఉంటున్న డీజీపీని తప్పించాలి
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌,  ఆగస్టు 7 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 12 వతేదీనుంచి టిజెఎసి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ పేర్కొన్నారు. బుధవారం టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అధ్యక్షతన రాజకీయ జేఎసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రంజాన్‌ పండుగ తర్వాత ఆందోళన కార్యక్రమాలను విస్తరిస్తామన్నారు. శాంతి సద్భావన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయించాల్సిన బాద్యతను తెలంగాణా కాంగ్రెస్‌ నేతలు బుజాన వేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంత జరుగుతున్నా కూడా తెలంగాణాకు చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నేతలు నోరు మెదపక పోవడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్‌సిపి నేతలు తెలంగాణ వారంతా పార్టీని వీడి తమతో జతకట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని తేలిపోయినందున ఆపార్టీని తెలంగాణలో సమాధి కట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు దూరంగా ఉన్న వైసిపి నేడు సీమాంధ్రలో ప్రత్యక్షంగా ఉద్యమాలలో  పాల్గొనడం చూస్తే సమైక్యవాద పార్టీ గానే భావించక తప్పదన్నారు. సీమాంధ్ర నేతలను తిప్పికొట్టాలి-తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమించాలి అనే నినాదంతో ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు కోదండరామ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో డిజిపి వ్యవహరిస్తున్న తీరును తాము పూర్తిగా ఆక్షేపిస్తున్నామన్నారు. తెలగాణాలో ఉద్యమాలు జరుగుతునప్పుడు హెలికాప్టర్‌ల ద్వారా పర్యవేక్షించడమేకాక, రోడ్లపై ఒక వ్యక్తికి నలుగురు పోలీసులను పెట్టిరోడ్లపైకి రాకుండా చూసిన డిజిపి దినేష్‌రెడ్డిని తొలగించి వేరేరాష్ట్ర క్యాడర్‌కు చెందిన అధికారిని నియ మించాలని డిమాండ్‌ చేశారు. ఎవరికైనా స్వంత అభిప్రాయం ఉంటే ఉండొచ్చని అయితే ఖాకీ డ్రెస్‌ ఉంద న్న విషయాన్ని గుర్తించకుండా సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి, యుపిఏ సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయాలను 12 తర్వాత గ్రామగ్రామాన వాడవాడనా తీసుకె ల్లేందుకు సభలు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వీటిపై కరపత్రాలు కూడా ముద్రించి పంచుతామన్నారు. త్వరలోనే గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు. అలాగేఉద్యమాన్ని ఉన్న ది ఉన్నట్లుగా చూపిస్తే తమకు ఎలాంటి అబ్యంతరం లేదని అయితే కొన్ని చానళ్లు, పత్రికలు తామే బుజాన వేసుకుని సీమాంధ్ర ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయని ఆక్షేపించారు. ఇందులో ఎన్టీవి ముందుందన్నారు. ఈ చానల్‌ను తెలంగాణా ప్రజలు చూడొద్దని, చానల్‌ చర్చలకు, ఫోన్‌ఇన్‌లు ఇవ్వరాదని తెలంగాణా వాదులకు, నాయకులకు జెఎసి పిలుపునిచ్చింది. ప్రెస్‌కాన్ఫరెన్స్‌లకు ఆచానల్‌ను పిలువద్దని, ఇంటర్వ్యూలు ఇవ్వరా దని కూడా నిర్ణయించామన్నారు. స్వయం ప్రతిపత్తి పేరుతో ఈచానల్‌ ఉద్యమాన్ని బుజానవేసుకుని నడిపిస్తోందన్నారు. చానల్‌ను బహిష్కరించమని చెప్పేందుకు తాము వారిలా దిగజారిపోవడం లేదన్నారు. ఉద్యమంలో పాల్గొనని వారిని దద్దమ్మలుగాను, గల్లీల్లో నిలదీయాలంటూ పిలుపునివ్వడం చూస్తుంటే ఆచానల్‌ ప్రత్యక్షంగా ఆందోళనను నిర్వహిస్తోందనే భావన ప్రతిఒక్కరికి కలుగుతుందన్నారు. తెలంగాణా కోసం కట్టు బడిఉద్యమం నడిపిస్తున్న టిఆర్‌ఎస్‌ అధినేతపై హత్యాయత్నాన్ని జెఎసి తీవ్రంగా ఖండించిందన్నారు. ఆలాగే సీమాంధ్రలోని సిపిఐ, బిజెపి కార్యాలయాలపై దాడులు ధ్వంసం చేయడాన్ని కూడా జెఎసి తీవ్రంగా ఆక్షే పించిందన్నారు. ఇందుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. తక్షణమే పోలీసులు కేసిఆర్‌కు భద్రత పెంచడంతోపాటు దోషులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కేసిఆర్‌కు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఈపార్లమెంట్‌లోనే తెలంగాణా బిల్లు పెట్టాలని, రేపటి క్యాబినెట్‌లో చర్చించి ప్రక్రియను వేగవంతం చేయాలని కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. నేడు హైదరాబాద్‌ను యూటి అని, కేంద్రప్రభుత్వం చేతిలో అధికారాలు కట్టబెట్టడం తది తర వినిపిస్తున్న ప్రతిపాదనలు  ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్‌ తోకూడి న పది జిల్లాల తెలంగాణా మాత్రమే అంగీకారమన్నారు. ఈప్రయత్నాలన్నీ తమహక్కులను కాలరాయడమే అవుతుందన్నారు.సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్యలను ఉత్పన్నం చేస్తుందని, తెలంగాణా ఉద్యోగులను కవ్వింపు చర్యలకు గురి చేస్తోందన్నారు. తెలంగాణా  ప్రజల హక్కులను కాలరా యడమే ప్రధాన ధ్యేయంగా ఎపిఎన్‌జిఓలు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించింది. తెలంగాణా ప్రకటన వచ్చే వరకు సైలెంట్‌గా ఉన్న సీమాంధ్ర నేతలు ఇప్పుడు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని సీమాంధ్ర కాంగ్రెస్‌, టిడిపి నేతలను ఆయన ప్రశ్నించారు. ఈపార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు.