‘సిటీలైట్‌’ మృతులు 17


వెలికితీత పూర్తి
ఇంకా ఇద్దరు ఏమైనట్టు?
హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) :
సికింద్రాబాద్‌లోని సిటీలైట్‌ ¬టల్‌ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఇంకా ఇద్దరి ఆచూకీ లభించలేదు. వారు కూడా మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల తొలగింపు తుది దశకు చేరుకుంది. ¬టల్‌లో పని చేసే వంట మనిషి, మరో కార్మికుడు కనిపించడం లేదని అధికారులు గుర్తించారు. వీరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇనుప చువ్వలను, సిమెంట్‌ దిమ్మెలను జేసీబీల సాయంతో తొలగిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు ఆధ్వర్యంలో రెండు పొక్లెయిన్లతో శిథిలాలలను తొలగించి, లారీల ద్వారా వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. భవన శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ¬టల్‌లో వెయిటర్‌గా పని చేసే వైనీ ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు 18 గంటలకు పైగా శిథిలాల కింద చిక్కుకున్న ఆయనను రెస్క్యూ టీం బయటకు తీసుకువచ్చింది. కాగా, శిథిలాల కింద నుంచి మంగళవారం ఉదయం మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. మృతులను ఖమ్మం జిల్లాకు చెందిన టీ మాస్టర్‌ వెంకటేశ్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన కిరణ్‌గా గుర్తించారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ¬టల్‌ మేనేజర్‌ అలీ, చీఫ్‌ కుక్‌ భరత్‌ జాడ లభించలేదు. దీంతో వారి కోసం కుటుంబ సభ్యులు సిటీలైట్‌ ¬టల్‌ శిథిలాల వద్ద రోదిస్తూ ఎదురుచూస్తున్నారు. తమ వారు సురక్షితంగా బయటపడాలని దేవుళ్లకు వేడుకుంటున్నారు. సిటీలైట్‌ ¬టల్‌ భవనం కూలిన ప్రమాదంలో మృతి చెందిన 13 మందిలో ఆరుగురి మృతదేహాలు గాంధీ ఆస్పత్రిలోనే ఉన్నాయి. బంధువుల ఎవరూ రాకపోవడంతో మృతదేహాలను గాంధీ మార్చురీలో భద్రత పరిచారు. కుటుంబ సభ్యులు, బంధువులు వస్తే వారికి అప్పగిస్తామని అధికారులు తెలిపారు. సిటీలైట్‌ ¬టల్‌ ఘటన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పాత భవనాలపై దృష్టి సారించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న పురాతన భవనాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దరిమిలా జీహెచ్‌ఎంసీ ఆయా భవనాలను గుర్తించే పనిలో పడింది. దాదాపు 700 భవనాలను గతంలోనే గుర్తించినప్పటికీ, మరోమారు ఈ ప్రక్రియను పునఃప్రారంభించారు. మంగళవారం నుంచి సర్కిళ్ల వారీగా పాత భవనాల గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. శేరిలింగంపల్లి సర్కిల్‌ పరిధిలో 23, ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో 8 పురాతన భవనాలను గుర్తించారు. ఆయా భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై స్పందించకపోతే కూల్చివేస్తామని హెచ్చరించారు. శిథిలావస్థకు చేరిన 12 భవనాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు.