20 మంది ఒప్పంద అధ్యాపకులపై వేటు

శ్రీకాకుళం, జూలై 18 : జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 20 మంది ఒప్పంద అధ్యాపకులపై వేటు వైస్తూ జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌.రాజ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో జరిగిన వార్షిక పరీక్షల్లో 40 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదై వప్పంద అధ్యాపకులను ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొనసాగించరాదని, ఇప్పటికే కళాశాల విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని మొత్తం 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులతో అదనపు జాయింట్‌ కలెక్టర్‌ రాజ్‌కుమార్‌ సమావేశమై తక్కువ ఉత్తీర్ణత వచ్చిన ఒప్పంద అధ్యాపకుల వివరాలపై సమీక్ష జరిపారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు వారిని కొనసాగించరాదని నిర్ణయించారు. తొలగింపునకు గురైన వారిలో పాలకొండ నుంచి ఐదుగురు, సీతంపేటలో ఏడుగురు, వీరఘట్టంలో నలుగురు, ఇచ్ఛాపురంలో ఇద్దరు, నరసన్నపేట, శ్రీకాకుళం పురుషుల కళాశాలల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

తాజావార్తలు