20 రోజులుగా మధ్యాహ్న భోజనం బంద్ పట్టించుకోని అధికారులు
ఖమ్మం, జూలై 19: ఒకటికాదు రెండు కాదు ఏకంగా 20 రోజులు పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకపోయినా విద్యాశాఖాధికారులు పట్టించుకోని వైనం ఇది. ఒక్క రోజు కూడా విద్యార్థులకు భోజనం పెట్టకపోతే అధికారులు స్పందించి అందుకుగల కారణాలు తెలుసుకొని, అందుకు గల కారణాలను తొలగించాలని ప్రభుత్వ ఆదేశాలు, అటువంటివి భద్రాచలం మండలంలోని గొల్లగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో 20 రోజుల నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం లేదు. అయినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. చిన్నారులకు పెట్టే మధ్యాహ్న భోజనంపై అధికారులు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో అర్థమవుతోంది. పాఠశాలలో ఉన్న బియ్యం గత నెల 25వ తేదీన అయిపోయాయని, బియ్యం ఇప్పించాలని ఎన్నిసార్లు అధికారులను అడిగినా వారు పట్టించుకోవడం లేదని ఏజెన్సీ సభ్యురాలు చెబుతున్నారు. సంబంధిత మండల విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా ఈ సమస్య ఇంతవరకు తమ దృష్టికి రాలేదని, వెంటనే సమస్యను సమిసిపోయేందుకు కృషి చేస్తామన్నారు.