జీ20లో సిరియానే హాట్‌ టాపిక్‌


సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) :
జీ20 శిఖరాగ్ర సన్నాహాక సమావేశంలో సిరియానే హాట్‌ టాపిక్‌గా మారింది. గురువారం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ఆర్థిక అభివృద్ధే ఎజెండాగా జరుగుతున్న శిఖరాగ్ర సమావేవంలో 19 దేశాధినేతలతో పాటు యురోపియన్‌ యూనియన్‌ పాల్గొంటుంది. సిరియాపై యుద్ధ సన్నాహాలకు అమెరికా చేస్తున్న చర్యలను పలు దేశాధినేతలు తప్పుబట్టారు. అలాగే అమెరికా గూఢచర్య రహస్యాలను వెలుగులోకి తెచ్చిన ఎడ్వర్డ్‌స్నోడెన్‌కు రష్యా ఆశ్రయం ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్న అమెరికా, సిరియాకు ఆ దేశం మద్దతునివ్వడాన్ని తప్పుబడుతోంది. మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలు అమెరికా ఆర్థిక విధానాలపై మండిపడుతున్నాయి. ఆర్థిక ఉద్దీపన చర్యలను విమరించేందుకు అమెరికా పూనుకోవడంపై అభివృద్ధి చెందుతున్న దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర నిధి, సీఆర్‌ఆర్‌ ఏర్పాటుకు ఐదు దేశాల ప్రతినిధులు అంగీకరిచారు. ఆర్థిక మందగమనంతో ప్రపంచ దేశాలు కొట్టుమిట్టాడుతున్న తరుణంలో అమెరికా చేపట్టిన ఆర్థిక ఉద్దీపణ చర్యల విరమణ తమను కోలుకోకుండా చేస్తుందని ఐదు దేశాల ప్రతినిధులు అన్నారు. 15 వేల కోట్ల డాలర్లతో అత్యవసర నిధి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ, సంప్రదాయేతర ద్రవ్య విధానాలకు మంగళం పాడాలని కోరారు. ఈ విధానాలతో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక మందగమనంతో అవస్థలు ఎదుర్కొంటున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.