2014లో ఎన్డీయే గెలిస్తే తెలంగాణ ఇస్తాం షానవాజ్‌ హుస్సేన్‌

హైదరాబాద్‌, జూన్‌ 10 (జనంసాక్షి): బిజెపి వల్లే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ పునరుద్ఘాటించారు. పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. తనను కలిసిన విలేకరులతో ఆదివారం ఉదయం మాట్లాడారు. తమ పార్టీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ ఇప్పటికే ఆ అంశంపై పలుమార్లు పార్లమెంటులో ప్రస్తావించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. 2014లో ఎన్డీఎ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ వెంటనే తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరకాల ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నట్టు చెప్పారు. మధ్యాహ్నం అక్కడకు చేరుకుని రోడ్డుషోలో పాల్గొననున్నట్టు తెలిపారు. తెలంగాణపై తమ పార్టీ వైఖరిని మరోసారి ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా విలేకరుల సమావేశంలో సినీ నటుడు, బిజెపి నేత కోట శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.