28నుంచి శ్రీవారి తోమాల సేవ ప్రసారం

తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి తోమాల సేవను ఇంటి దగ్గరే కూర్చుని తిలకించే బాగ్యాన్ని తితిదే ఈనెల 28 నుంచి కల్పించనుంది. శ్రీవారి ఆర్జిత సేవలను నమూనా ఆలయం నుంచి తితిదే చిత్రీకరించింది. తిరుమల ఆలయంలో స్థలాభావం కారణంగా స్వామివారి సేవలను భక్తులందరూ తిలకించే భాగ్యం కలగడంలేదు. స్వామివారి సేవలను శ్రీవెంకటేశ్వర భక్తిఛానల్‌ ద్వారా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించింది. నమూనా ఆలయంలో చిత్రీకరించిన ఆర్జిత సేవలను గోవిందం పరమానందం పేరిట ప్రసారానికి జనవరి 30న రథసప్తమి పర్వదినాన సుప్రభాతం సేవతో శ్రీకారం చుట్టింది. వరుసగా తోమాల, కొలువు, ఏకాంత సేవ, అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ, అభిషేకం సేవలను ప్రసారం చేయాలని సంకల్పించింది. 28 నుంచి ఉదయం పూట తితిదే ఛానల్‌లో సేవను ప్రసారం చేయనున్నారు.