28 డెడ్‌లైన్‌

ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తది
సీమాంధ్రుల ఆర్థిక మూలాలే లక్ష్యం
ఈ మారు దమ్ముంటే సీమాంధ్ర నేతలు
రాజీనామా చేయాలి : కోదండరామ్‌ సవాల్‌
హైదరాబాద్‌, జనవరి 21 (జనంసాక్షి) :
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఈనెల 28లోగా స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. 28 తర్వాత శాంతియుతంగా మిలిటెంట్‌ తరహాలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకు అడ్డు పడుతున్న సీమాంధ్ర నేతలే లక్ష్యంగా భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని తేల్చి చెప్పారు. వారి ఆర్థిక మూలాలను లక్ష్యంగా చేసుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. సీమాంధ్ర నేతలకు దమ్మూధైర్యం ఉంటే ఈ మారు పదవులకు, పార్టీలకు రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్‌ విసిరారు. సమైక్య ఉద్యమం టైంపాస్‌ ఉద్యమమని మండిపడ్డారు. సోమవారం న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జేఏసీ సమావేశమైంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐలతో పాటు నాగం జనార్దన్‌రెడ్డి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, సీమాంధ్ర నేతల లాబీయింగ్‌, ఢిల్లీ పరిస్థితులు తదితర అంశాలపై కులంకుషంగా చర్చించారు. 28 తర్వాత తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకపోతే ఏం చేయాలనే దానిపై ప్రాథమికంగా నిర్ణయించారు. శాంతియుతంగా కొనసాగుతున్న ఉద్యమ రూపాన్ని మార్చాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. సీమాంధ్రుల ఆర్థిక మూలాలే లక్ష్యంగా పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని మెజార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ తరహాలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. భేటీలో జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ గతంలో ఎన్నడూ లేని తరహాలో చాలా ఆవేశంగా మాట్లాడారు. జనవరి 28లోగా తెలంగాణపై కేంద్రం నిర్ణయం ప్రకటించాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. తెలంగాణ ఇవ్వకుంటే ఉద్యమ తీరు మారుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏళ్ల తరబడి ఉద్యమిస్తున్నామని, తమలో ఇంకా శక్తి ఉందని తెలిపారు. తెలంగాణకు అడ్డుపడుతున్న సీమాంధ్ర నేతలే లక్ష్యంగా ఉద్యమం ఉండబోతుందన్నారు. ఇకపై మా గురి, లక్ష్యం సీమాంధ్ర నేతలేనని అన్నారు. సీమాంధ్ర నేతలే లక్ష్యంగా రహస్య చర్చలు జరిపి భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఆర్థిక మూలాలే లక్ష్యంగా పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. 28 తర్వాత కేంద్రం రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయకపోతే ఉద్యమం ఉధృతంగా ఉంటుందని కోదండరాం హెచ్చరించారు. అసెంబ్లీ ముట్టడి కావొచ్చు, హైదరాబాద్‌ ముట్టడి కావొచ్చు, 100 రోజుల సకల జనుల సమ్మె కావొచ్చు, మరేదైనా కావొచ్చు భవిష్యత్‌ కార్యాచరణ మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుందన్నారు. చైన్యవంతమైన మిలిటెంట్‌ ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రం పేరుతో కొందరు సీమాంధ్ర నేతలు తెలంగాణను అడ్డుకొనేందుకు యత్నిస్తున్నారని కోదండరాం విమర్శించారు. కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారని మండిపడ్డారు. సమైక్య ఉద్యమం టైంపాస్‌ ఉద్యమమని అభివర్ణించారు. ఒత్తిడి పెంచడం కాదు.. దమ్ముంటే రాజీనామాలు చేసి పోరాడండి అని సీమాంధ్ర నేతలకు సవాల్‌ విసిరారు. పదవులను వీడేందుకు సిద్ధమా? పార్టీని వీడి బయటకు వచ్చే దమ్ముందా? చేతగానివాళ్లే ఇలా మాట్లాడుతుంటారని సీమాంధ్ర నేతలపై నిప్పులు చెరిగారు. 27న ఊహించని రీతిలో ఉద్యమం ఉంటుందని హెచ్చరించారు.కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావుపై నాగం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణపై కేంద్రం నెల రోజుల గడువు విధించగానే కేవీ తన కుట్రలను మొదలుపెట్టాడని నిప్పులు చెరిగారు. ఈ నెల 28న కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకపోతే ఆ పార్టీని ఖతం చేస్తామని హెచ్చరించారు. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజలుసిద్ధం కావాలని కోరారు. సీమాంధ్ర నేతల లక్ష్యంగా ఉద్యమాన్ని రూపొందిస్తామని న్యూడెమోక్రసీ తెలిపింది. టీడీపీ, వైఎస్సార్‌సీపీపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ఉంటుందని పేర్కొంది. తెలంగాణకు కాంగ్రెస్సే ప్రధాన అడ్డంకి అని, తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఈ నెల 28 తర్వాత మిలిటెంట్‌ తరహా పోరాటాలు చేస్తామని హెచ్చరించింది.