30లోగా రైతులు ఖాతాలు తెరవాలి
లేకుంటే పెట్టుబడి రాయితీ వెనక్కి మళ్లింపు
కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
శ్రీకాకుళం, జూన్ 24 : రైతులు ఈ నెల 30 తేదీలోగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని, లేకుంటే పెట్టుబడి రాయితీ వెనక్కి పంపించేస్తామని జిల్లా కలెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖలు, మండల ప్రత్యేకాధికారులతో సమీక్షించారు. మండల వ్యవసాయాధికారులు, ఆదర్శరైతులు రైతులకు సహకరించి జీరో అకౌంటు ఖాతాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖాతాలు ప్రారంభించకపోతే పెట్టుబడి రాయితీ వెనక్కి వెళుతుందని స్పష్టం చేశారు. ఆదర్శ రైతులు సకాలంలో స్పందించి ఖాతాలు తెరవడానికి సహకరించాలని, లేకుంటే వారిని తొలగించాలని ఆదేశించారు. జిల్లాకు అవసరమైన విత్తనాలను వెంటనే సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌తో కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాకు బిపిటి రకం 10వేల క్వింటాళ్లు కేటాయించారని, అందులో ఆరువేల క్వింటాళ్లు వచ్చాయన్నారు. 1001 రకం విత్తనాలు 23 వేల క్వింటాళ్లు కేటాయించగా 11 వేల క్వింటాళ్లు వచ్చాయని తెలియజేయగా, రెండు రోజుల్లో 4 వేల క్వింటాళ్లు బిపిటి విత్తనాలు అందిస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు, విషపూరిత విత్తనాలు, ఎరువులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వ్యవసాయాధికారులకు ఆదేశించారు. డీలర్ల వద్ద నిల్వలపై తనిఖీలు చేయాలని ఆర్‌డిఓలు, వ్యవసాయాధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
పాఠశాలల మరమ్మతులకు రూ.10వేలు : పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర మరమ్మతులకు రూ.10వేలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. వినియోగానికి వీలుగా లేని మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించుకోవచ్చునని చెప్పారు. ఉపాధ్యాయ, విద్యార్థుల హాజరును ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.భాస్కర్, అదనపు జాయింట్ కలెక్టర్ పి.రజనీకాంతారావు, డిఆర్‌ఓ నూర్‌భాషా ఖాసీం, జిల్లా పరిషత్ సిఇఓ డా. పి. సుధాకరరావు, వ్యవసాయశాఖ జేడి ఎస్.మురళీకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.