5 సంవత్సరాల పదవీకాలంలో మధుర స్మృతుల కన్న చేదు జ్ఞాపకాలే అధికం

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు
కలగానే మిగిలిన గుండంకట్ట అభివృద్ధి
వాహనానానికి డీజిల్‌ వేయించలేని పరపతి, పవర్‌ నాది
మునిసిపల్‌ ఛైర్మన్‌ బూర్సు మాలకొండయ్య
కందుకూరు, జూలై 18: ఐదు సంవత్సరాల పదవీకాలంలో మధుర స్మృతుల కన్న జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలు అధికం అని మునిసిపల్‌ ఛైర్మన్‌ బూర్సు మాలకొండయ్య అన్నారు. బుధవారం 19న పదవీకాలం పూర్తి అవుతున్న సందర్భంగా ఛైర్మన్‌ను ఛాంబర్‌లో కలిసిన విలేకరులతో పదవీకాలంలో తన అనుభవాలను ఛైర్మన్‌ పంచుకున్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన తాను ఎన్నో ఆశయాలతో చైర్మన్‌ పదవి స్వీకరించానని అన్నారు. అయితే వ్యవస్థకు, సమాజానికి తాను అతీతున్ని కానని, వ్యవస్థలో అణగారిన వర్గాలకు పదవి వలన ఉపయోగం లేదన్న వాస్తవం కొద్దికాలంలోనే బోధపడిందని అన్నారు. తాను పదవి స్వీకరించిన మూడవ రోజును గుండంకట్ట అభివృద్ధి చేస్తానని ప్రజలకు ఇచ్చిన హామీ కలలాగే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేసింది. కోట్లాది రూపాయల నిధులు వచ్చినా మంత్రి మహీధర్‌రెడ్డి తన నివాసంలో అధికారులతో కలిసి కేటాయింపులు చేసి మునిసిపల్‌ కౌన్సిలన్‌ను అవమానించారని ఆరోపించారు. చైర్మన్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండానే నిధుల కేటాయింపులు జరిగాయని ఆయన ఆరోపించారు. చివరకు మునిసిపల్‌ ఛైర్మన్‌ను అయిన తాను వినియోగించిన వాహనానికి డీజిల్‌ పట్టించలేని పవర్‌ లేని పదవి తనదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజల సహకారంతో సమస్యల పరిష్కారానికి కొన్ని ప్రాంతాల్లో అభివృద్దికి కృషి చేశానని, తనకు సహాయ సహకారాలు అందించిన ప్రజలను జీవితాంతం మరువనని ఆయన అన్నారు.