ఉత్తరాఖండ్‌ వరదల్లో 5,748 మంది గల్లంతు


మరణించినట్టుగా ప్రకటించలేం
మృతులకు, గల్లంతయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
ఉత్తరాఖండ్‌ సీఎం విజయ్‌ బహుగుణ
డెహ్రాడూన్‌, జూలై 15 (జనంసాక్షి) :
ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన వరదల్లో 5,748మంది గల్లంతయ్యారని ఉత్తరాఖండ్‌ సీఎం విజయబహుగుణ తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు కేంద్ర ప్రణాళిక, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి రాజీవ్‌ శుక్లా పాల్గొన్నారు. విజయబహుగుణ మాట్లాడుతూ గత నెల 16న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు సంభవించిన విషయం తెలిసిందేనన్నారు. గల్లంతయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతునే ఉంటాయన్నారు. వరదలో మృతి చెందిన వారి కుటుంబాలకు, గల్లంతయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను మంగళవారం నుంచి అందించనున్నట్టు తెలిపారు. ఒకవేళ గల్లంతయిన వారు తిరిగి వచ్చేస్తే వారు తీసుకున్న పరిహరాన్ని తిరిగి ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. ప్రస్తుతం కేదార్‌నాధ్‌లో ప్రతికూల వాతావరణం నెలకొందన్నారు. పారిశుధ్య చర్యలు మెరుగు పరిచేందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. కేదార్‌నాధ్‌ రహదారులను పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అయితే గల్లంతయిన వారందరినీ మృతులుగా ప్రకటించబోమని స్పష్టం చేశారు. మృతుల కుటంబాలతో సమానంగా వారికి పరిహారం అందజేసినా మృతులుగా మాత్రం ప్రకటించబోమని పేర్కొన్నారు.