శాన్‌ఫ్రాన్‌సిస్కోలో విమాన ప్రమాదం


ఇద్దరు దుర్మరణం, వంద మందికి గాయాలు
శాన్‌ఫ్రాన్‌సిస్కో, జూలై 7 (జనంసాక్షి) :
అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కో విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతూ ఓ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 100మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్టు సమాచారం. ఎయిర్‌పోర్టులో విమానం దిగే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తం కావడంతో  ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విమానంలో మొత్తం 291మంది ప్రయాణికులు.. 16 మంది సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా దక్షిణకొరియాకు చెందిన బోయింగ్‌ 777 ఆసియానా ఎయిర్‌లైన్స్‌ విమానం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ నుంచి బయల్దేరి వచ్చి శాన్‌ఫ్రాన్‌సిస్కో విమానాశ్రయంలో దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద వార్త తెలియగానే దక్షిణకొరియా ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని శాన్‌ఫ్రాన్‌సిస్కోకు పంపింది. ప్రమాదం ఎలా జరిగిందన్న  దానిపై అధికారులు, సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.
అదొక అద్భుత అనుభవం..
విమాన ప్రమాదం నుంచి తాము బయటపడడం అద్భుత అనుభవం అని భారతీయ ప్రయాణికుడు వేదపాల్‌ మీడియాకు తెలిపారు. విమానం ల్యాండ్‌ కాగానే మంటలు వ్యాపించాయని అన్నారు. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు, సిబ్బంది అప్రమత్తం కావడంతో సురక్షితంగా బయటపడ్డామని తెలిపారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు