గయా బౌద్ధ ఆలయంలో పేలుళ్లు


ఐదుగురికి గాయాలు
తీవ్రంగా ఖండించిన ప్రధాని
ముందే సమాచారమిచ్చాం : షిండే
దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు : నితీశ్‌
గయ (బీహార్‌), జూలై 7 (జనంసాక్షి) :
గయాలోని మహాబోధి ఆలయ సముదాయంలో ఆదివారం ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో అయిదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేలుళ్ల ఘటనను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఖండించారు. ఇటువంటి వాటిని సహించబోమని స్పష్టం చేశారు. బీజేపీ స్పందిస్తూ నిఘావర్గాల హెచ్చరికలను ప్రభుత్వం విస్మరించడం వల్లే దుర్ఘటన చోటు చేసుకుందని ఆరోపించింది. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆలయ అధికారులను, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఇది ఉగ్రవాదుల పనేనని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామి వ్యాఖ్యానించారు. పేలుళ్ల ఘటనను దర్యాప్తు చేసేందుకు  సంఘటన స్థలానికి ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ బృందాలను పంపామని అన్నారు. ఈ దుశ్చర్యకు తామే బాధ్యులమని ఏ తీవ్ర వాద సంస్థ కూడా ప్రకటించలేదని చెప్పారు. అలాగే స్పెషల్‌ బ్రాంచ్‌ డీఐజీ పరాస్‌నాధ్‌ మాట్లాడుతూ కోల్‌కతా నుంచి ఎన్‌ఐఏ అధికారుల బృందాన్ని బుద్ధగయాకు పంపినట్టు తెలిపారు. అదేవిధంగా బుద్ధ గయ కమిటీ కార్యదర్శి దోర్జి మాట్లాడుతూ ఆలయ పరిసర ప్రాంతాల్లో నాలుగు చోట్ల పేలుళ్లు సంభవించాయన్నారు. అదృష్టవశాత్తు.. బోధి వృక్షానికి, ప్రధాన ఆలయానికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదన్నారు. తొలి పేలుడు ధాటికి ఫర్నిచర్‌ ధ్వంసమైందని, ఆ సమయంలో ఇద్దరు గాయపడ్డారని అన్నారు. రెండో పేలుడు ధాటికి కొన్ని పుస్తకాలు చెల్లాచెదురయ్యాయని చెప్పారు. ఇదిలా ఉండగా పేలుళ్ల ఘటనను శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె ఖండించారు. పేలుళ్లకు సంబంధించిన నివేదికను అందజేయాలని భారత హై కమిషనర్లను కోరారు.
పేలుళ్లపై మగధ రేంజ్‌ డిఐజి నాయర్‌ హుస్నేన్‌ఖాన్‌ మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య మహాబోధి ఆలయ సముదాయంలో వరుసగా ఎనిమిదిచోట్ల పేలుళ్లు జరిగాయి. మహాబోధి ఆలయ సముదాయంలో నాలుగుచోట్ల, కరమ్‌పా వద్ద మూడుచోట్ల.. బుద్ధ విగ్రహానికి 80 అడుగుల దూరంలో ఒకచోట పేలుళ్లు సంభవించాయి. ఆలయ సముదాయంలోను, బస్టాండు వద్ద ఉన్న రెండు బాంబులను ప్రత్యేక బృందాలు నిర్వీర్యం చేశాయని తెలిపారు. పేలుళ్ల సమయంలో భక్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో పెను నష్టం తప్పిందని అన్నారు. అయిదుగురు గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారిలో ఇద్దరు యాత్రీకులు కాగా ఒకరు మయన్మార్‌కు… మరొకరు టిబెట్‌కు చెందినవారిగా గుర్తించామని తెలిపారు. వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు.
గయ నుంచి..
గయ నుంచి పది కిలోమీటర్ల దూరంలో బుద్ధగయ బుద్ధుడి ఆలయం ఉంటుంది. బీహార్‌ రాజధాని నగరమైన పాట్నా నుంచి అయితే 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయమిది. అలాగే మహాబోధి వృక్షం కూడా ఎంతో ప్రాముఖ్యత గలది. 2500 సంవత్సరాల క్రితం బోద్‌ గయ జిల్లాలో మహబోది ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. టిబెటియన్ల మార్గదర్శకుడు దలైలామా తరచుగా బోద్‌గయలోని ఆలయానికి వస్తుంటారు. శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే ఆరునెలల క్రితం ఈ ఆలయాన్ని దర్శించుకున్న విషయం తెలిసిందే.
ఆధారాలందగానే చర్యలు.. : నితీష్‌
పేలుళ్ల ఘటన సమాచారం అందగానే రోడ్డు మార్గం గుండా మహా బోధి ఆలయానికి ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ చేరుకున్నారు. దుర్ఘటన ప్రాంతాలను పరిశీలించారు. జరిగిన దుర్ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ పేలుళ్లకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆధారాల కోసం ఎన్‌ఐఎ,ఎన్‌ఎస్‌జి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నాయని, నివేదిక అందగానే స్పందిస్తామని అన్నారు.
హైఅలర్ట్‌
బోద్‌గయలో పేలుళ్ల ఘటనను దృష్టిలో పెట్టుకుని కేంద్ర బలగాలు, పోలీసులు భద్రతను మరింత కట్టు దిట్టం చేశారు. పాట్నాలోని రైల్వేస్టేషన్‌, బస్టాండులు, మార్కెట్‌ సముదాయాలు, ప్రధాన కూడళ్ల వద్ద, ప్రముఖ దేవాలయాల వద్ద భద్రతను మరింత పెంచారు. పాట్నా రైల్వేస్టేషన్‌లో భద్రత దళాల సంఖ్యను పెంచారు.  కొందరు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.
ఎనిమిది నగరాల్లో భద్రత పెంపు
మహబోద్‌ ఆలయంలో చోటుచేసుకున్న పేలుళ్ళ ఘటనపై హోంమంత్రిత్వశాఖ పలు నిర్ణయాలు తీసుకుంది. ఆదివారం ఉదయం గయలోని మహబోద్‌ ఆలయంలో  పేలుళ్లు జరగడం.. ఎనిమిది మందికి గాయాలవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంమంత్రిత్వశాఖ ఎనిమిది నగరాల్లోని పోలీసులను అప్రమత్తం చేసింది. అలాగే, ఢిల్లీలోనూ భద్రతను మరింత పెంచింది. ఢిల్లీలోని సున్నితమైన ప్రాంతాలలో బారికేడ్లను ఏర్పాటుచేసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్ల వద్ద కూడా భద్రతను మరింత పెంచారు. అదే విధంగా ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, పూణె, హైదరాబాద్‌లలోని పోలీసులను అప్రమత్తం చేసింది. ఇదిలా ఉండగా, ఇండో-నేపాల్‌ సరిహద్దు ప్రాంతం వద్ద మరింత భద్రతను పెంచారు. బుద్ధగయాలో పేలుళ్లపై కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే స్పందిస్తూ బీహార్‌ ప్రభుత్వానికి తాము ముందస్తుగానే హెచ్చరికలు పంపామని అన్నారు. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యేనని పేర్కొన్నారు.