ఎన్నికల వేళ తెలంగాణ అమరవీరుల స్తూపానికి బాబు సైతం నివాళి


అధికారంలోకి వస్తే అమరుల కుటుంబాలను ఆదుకుంటాం : బాబు
వరంగల్‌  జూలై 7 (జనంసాక్షి) :
ఎన్నికల వేల ఆంధ్ర బాబు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చాడు. హన్మకొండలో ఆదివారం నిర్వహించిన టీడీపీ రిజినల్‌ సమావేశంలో చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ అమరులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బాబు మాట్లాడుతూ, దేశంలో తృతీయ కూటమియే అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు టీడీపీదే కీలకపాత్ర ఉంటుందని అన్నారు. ఉత్తరాఖండ్‌ ఘటనలో మృతిచెందినవారికి నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. కార్యకర్తల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలిస్తానన్నారు. కార్యకర్తలు గట్టిగావిశ్వసిస్తే గెలుపు పెద్దకష్టం ఏం కాదన్నారు. రాష్ట్రంలో టిడిపి చేపట్టిన అనేక అభివృద్ది పథకాలు నేడు కొనసాగిస్తే దేశంలోనే ఆదర్శంగానిలిచేదని చంద్రబాబు పేర్కొన్నారు. రాబందుల పాలన అధికారంలో రావడం వల్లే నేడు సమస్య లు జటిలంగా మారాయన్నారు. పిల్లలను బాగా చదివించాలని, ఎంత చదివిస్తే అంత బాగుపడుతారన్నారు. వృద్దులకు వెయ్యి రూపాయలు పించన్‌ ఇస్తామన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌లా లక్ష కోట్లు సంపాదించి టీవీ, పేపర్‌ పెట్టారని, టీఆర్‌ఎస్‌ కుటుంబ అవినీతితో కూరుకు పోయిందన్నారు. ఈ సందర్భంగా వరంగల్‌ మాజీ ఎంపీ చాడసురేశ్‌ రెడ్డి, ఆప్కో మాజీ చైర్మన్‌ మండలి శ్రీరాములులు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. చంద్రబాబు వారి రువురికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.