కుప్పకూలిన ‘సిటీలైట్‌’


13 మంది దుర్మరణం
14 మందికి తీవ్రగాయాలు
ఉలిక్కిపడ్డ హైదరాబాద్‌
హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి) :
సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతిరోడ్‌ ప్రాంతంలో గల రెండస్తుల సిటీలైట్‌ ¬టల్‌ భవనం సోమవారం ఉదయం ఆరున్నరకు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనం వద్ద సుమారు నలభై నుంచి యాభై మంది ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఉదయంపూటే విధులకు వెల్లేవారితో బిజీగా ఉన్న రాష్ట్రపతి భవన్‌ రోడ్డునుంచి వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే జిహెచ్‌ఎంసి, అగ్నిమాపక విభాగం, పోలీసులు, రెవెన్యూ తోపాటు 12 విభాగాలకు చెందిన అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఆరు పొక్లెయిన్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు 13 మంది మృతదేహాలను బయటకు తీశారు. మొత్తం 22 మందిని బయటకు తీశారు. గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రితోపాటు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. సంఘటన తెలుసుకున్న వెంటనే జిహెచ్‌ఎంసి కవిూషనర్‌ కృష్ణబాబు, నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మతో పాటు రాజకీయ నాయకులు సంఘటనా స్థలాన్ని  సందర్శించారు. సహాయక చర్యలను చేపడుతుండగా సాదారణ ప్రజానీకం గుమికూడడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన ప్రత్యేక బృందం కూడా పాల్గొంటున్నారు. సంఘటనా స్థలాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మంత్రి దానం నాగేందర్‌ తదితరులు సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పది గంటల సమయంలో కూడా శిథిలాల కింద నుంచి ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు 19 మందిని రక్షించగా మరెంత మంది ఉన్నారో, ఇందులో చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారో తెలియక అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు చెందిన అంబులెన్స్‌లు, జిహెచ్‌ఎంసి వాహనాలను సిద్దంగా ఉంచి రక్షించిన వారిని రక్షించినట్లుగానే తరలిస్తున్నారు. సంఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. అయితే మంత్రి మాత్రం ప్రమాదం జరిగినప్పుడు సహాయకచర్యల గూర్చి తోచినంత సహాయం చేసేందుకు ముందుకు రావాలని ప్రతి సంఘటనను రాద్దాంతం చేయవద్దన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారు తెలుపుతున్నారు. తెల్లవారు జామునుంచే హలీమ్‌ తయారు చేసేందుకు పెద్దఎత్తున మంటలు పెట్టడంతో గోడలు వేడెక్కి కూలిపోయి ఉంటాయనేది కూడా స్థానికులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు గీతారెడ్డి, అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం తదితరులు క్షతగాత్రులను పరామర్శించారు.