వేలం పాటలు నిర్వహిస్తే తీవ్ర చర్యలు రమాకాంత్‌రెడ్డి


హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి) :
గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండానే వేలం పాటలు నిర్వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంతరెడ్డి అన్నారు. ఏటీఎంల ద్వారా డబ్బు పంపిణీ కాకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని అన్నారు. వరంగల్‌ జిల్లా మంగపేట మండలంలోని 18 పంచాయతీల ఎన్నికలను రద్దు చేశామని తెలిపారు. వేలం పాటలు కొనసాగుతున్నట్టు అయిదు జిల్లాల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. రెండు జిల్లాల్లో కొనసాగుతున్న వేలం పాటదారులపై కేసులు నమోదు చేశామని అన్నారు. వేలంపాటలు నిర్వహించే వారిపై పంచాయతీరాజ్‌ చట్టం కింద కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏకగ్రీవమయ్యే పంచాయతీల అభివృద్ధికిగాను ప్రోత్సాహకంగా 5 నుంచి 15లక్షల రూపాయ లను అందించనున్నట్టు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆయా జిల్లాల కలెక్టర్లు మంగళవారం వెలువరించనున్నట్టు చెప్పారు. మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 13 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. 14న పరిశీలన.. 17న ఉపసంహరణకు అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 23, 27, 31 తేదీల్లో మూడు విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందేనని అన్నారు.

నాలుగు పంచాయతీలపై కేసు : నవీన్‌

వేలం పాటలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అందడంతో నాలుగు పంచాయతీలపై కేసులు నమోదు చేశామని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఉప్పరిగూడ, తూర్పు గోదావరి జిల్లా పసలపూడి, కరీంనగర్‌ జిల్లా బస్వాపూర్‌, ప్రకాశం జిల్లా చిన్న ఓబిన్‌పల్లి పంచాయతీలపై కేసు నమోదు చేసినట్టు ఆయన వివరించారు.