యాసిడ్‌ అమ్మకాలను నియంత్రించండి

కేంద్రానికి సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి) :

విచ్చల విడిగా యాసిడ్‌ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం గట్టిగా తలంటించింది. యాసిడ్‌ దాడులను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యాసిడ్‌ విక్రయాలపై నిబంధనలు కఠినతరం చేసే విషయంలో సీరియస్‌గా వ్యవహరించడం లేదని మండిపడింది. మానవత్వం మంట గలిపేలా దేశంలో రోజుకో మహిళ యాసిడ్‌ దాడికి గురి అవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీసింది. యాసిడ్‌ కారణంగా ప్రతీక్షణం నరకం అనుభవిస్తున్న మహిళల గోడు మీకు అర్థం కావడం లేదా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. యాసిడ్‌ దాడులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకూ ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. రాష్టాల్రను సంప్రదించి యాసిడ్‌ అమ్మకాలపై నియంత్రణకు కార్యాచరణ రూపొందిస్తామని కేంద్రం హావిూ ఇచ్చి రెండు నెలలు దాటినా ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేదని జస్టిస్‌ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో వారం రోజుల్లో యాసిడ్‌ అమ్మకాల నియంత్రణకు అనుసరించే విధివిధానాలు తెలుపకపోతే అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకొని, నేరుగా ఆదేశాలు జారీ చేస్తుందని కేంద్రాన్ని హెచ్చరించింది.

యాసిడ్‌ అమ్మకాలపై నిషేధం విధించాలంటూ యాసిడ్‌ దాడికి గురైన ఓ బాధితురాలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని లోధా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోమారు విచారించింది. ఈ సందర్భంగా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. యాసిడ్‌ దాడుల్లో రోజూ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోరా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. కార్యాచరణ రూపొందిస్తామని ఏప్రిల్‌ 16న కోర్టుకు తెలిపిన ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. మరో వారం రోజులు గడువిస్తామని, ఈలోగా విధివిధానాలు రూపొందించకపోతే తామే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేసింది.