తెలంగాణ అల్లదిగో : డీఎస్‌


నిజామాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎంతో దూరంలో లేదని పీసీసీ మాజీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సానుకూలంగా ఉందని తెలిపారు. ఈమేరకు సంకేతాలున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తుందని, కాంగ్రెస్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి తీరుతుందని అన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందో, తర్వాతో ఈ మేరకు నిర్ణయం వెలువడ్డం ఖాయమని చెప్పారు. తెలంగాణలోని 90 శాతం ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఈ విషయం ఇప్పటికే స్పష్టమైందని అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటే తన అభిమతని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్‌ఎస్‌ అవసరముండదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. ఆ పార్టీ కూడా కాంగ్రెస్‌తో కలిసి వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు అసెంబ్లీలో తీర్మానం అవసరమా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తీర్మానం పెడితే తప్పేమి లేదన్నారు. కానీ రాష్ట్ర ఏర్పాటుకు ఈ తీర్మానంతో పనిలేదని, ఆర్టికల్‌ 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయమే ప్రామాణికమని పేర్కొన్నారు. తెలంగాణపై ఎవరి అభిప్రాయాలు వారివని అన్నారు.  రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఇరు ప్రాంతాల ప్రజలు ప్రేమాభిమానాలతో ఉండాలన్నారు. తెలంగాణలోని సెటిలర్లకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. రాయల తెలంగాణను ఇంతవరకూ ఎవరు అడగలేదని, కొందరు మాత్రమే ఈ ప్రతిపాదన ముందుకు తెస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు కలిగించేలా నేతలు వ్యవహరించడం సరికాదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఇరు ప్రాంతాల నేతలకు సూచించారు. హైకమాండ్‌ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు.