మరో మారు మోసపోవద్దు


తెలంగాణ ఇచ్చే వరకూ పోరు ఆపొద్దు
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. కొత్త నాటకానికి కాంగ్రెస్‌ పార్టీ తెరలేపినట్టుగా అనుమానం వస్తోందని అన్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. జేఏసీ నేతలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. చర్చ ముగిసిన అనంతరం మీడియాతో కోదండరాం మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై నాటకాలాడుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు. స్థానిక ఎన్నికలు ముగిసేలోపు తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. లేకుంటే ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ వేసిన కొత్త ఎత్తుగడగా భావిస్తామని అన్నారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్‌ పార్టీ గతంలో అనుసరించిన వైఖరే ఇందుకు నిదర్శనమని అన్నారు. రోడ్డుమ్యాప్‌ పేరుతో తెలంగాణ ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ యత్నిస్తోందన్నారు. తెలంగాణ రాకుండా సీమాంధ్ర నేతలు అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీపై సీమాంధ్ర నేతల పట్టు బలంగా ఉందని కోదండరామ్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానాన్ని సీమాంధ్ర నేతలు తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని విమర్శిం చారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను కాంగ్రెస్‌ అధిష్టానం పట్టించుకోవడం లేదన్నారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణవాదులను గెలిపించాలని సూచించారు. ఎన్నికల లోపు తెలంగాణపై నిర్ణయం వెలువడకపోతే భవిష్యతు కార్యాచరణను రూపొందించుకుంటామన్నారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌ పార్టీపై పోరాడేందుకు ఎన్నికల కోడ్‌, న్యాయ సమస్యలు అడ్డు వస్తున్నాయని అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ప్రజా ప్రతినిధులను రోడ్డు మ్యాప్‌ తయారు చేయాలన్న కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు విశ్వసించడం లేదన్నారు. వారితో రోడ్డు మ్యాప్‌పై నివేదిక రూపొందించడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ జిల్లాల్లో జేఏసీ జనచైతన్య యాత్రలు నిర్వహించనున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈనెల 12న లేదా 15నుంచి జన చైతన్య యాత్రలను నిర్వహిస్తామని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలను చైతన్యవంతం చేస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమ శక్తులను పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చామని తెలిపారు.