ప్రజాప్రతినిధి దోషిగా తేలితే అనర్హుడే


సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ, జూలై 10 (జనంసాక్షి) :
ప్రజాప్రతినిధి క్రిమినల్‌ కేసుల్లో దోషిగా తేలితే అనర్హుడేనని సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజకీయాల్లో నేర చరితులపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. క్రిమినల్‌ కేసుల్లో ప్రజాప్రతినిధులు దోషులుగా తేలితే తక్షణమే అనర్హత వేటు పడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల కేసుల్లో ప్రజాప్రతినిధులు దోషులుగా నిర్దారణ అయితే ఎన్నికల్లో పోటీ నుంచి నిషేధించాలని సూచించింది. ప్రజాప్రతినిథ్య చట్టంలోని 8 (4) నిబంధన న్యాయసమ్మతం కాదని జస్టిస్‌ ఏకే పట్నాయక్‌, జస్టిస్‌ ఎజ్‌ ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. అయితే, పాత కేసులకు ఈ తీర్పు వర్తించదని పేర్కొంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దోషులుగా తేలితే వెంటనే అనర్హులుగా ప్రకటించాలని ఆదేశించింది. తదుపరి ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అనర్హులు అని తేల్చి చెప్పింది. జైలు నుంచే పోటీ చేయడం ఇకపై చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. అనర్హత వేట నుంచి ప్రజాప్రతినిధులు తప్పించుకొనే వెసులుబాటు కల్పించే నిబంధన సరికాదని వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిథ్య చట్టంలోని అనర్హత నుంచి తప్పించుకొనే నిబంధన న్యాయ సమ్మతం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. తీర్పు వెలువడక ముందే దోషులైన ప్రజాప్రతినిధులు అప్పీలుకు వెళ్తే అనర్హత వర్తించదని పేర్కొంది. తీర్పు వచ్చిన మూడు నెలల వరకూ అప్పీలుకు వెళ్లేందుకు అవకాశం లేదని తెలిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు రెండేళ్ల జైలుశిక్ష పడితే శాసనసభ సభ్యత్వం కోల్పోతారని స్పష్టంచేసింది. చట్టంలోని లొసుగుల నుంచి నేరస్తులు తప్పించుకుంటున్నారని అభిప్రాయపడిన కోర్టు.. అప్పీలు పెండింగ్‌లో ఉన్నంత కాలం ప్రజాప్రతినిధులు అనర్హులు కాదన్న నిబంధనను కోర్టు తోసిపుచ్చింది.