రంజాన్‌కు భారీ బందోబస్తు సీపీ అనురాగ్‌శర్మ


హైదరాబాద్‌, జూలై 10 (జనంసాక్షి) :
ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌ నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. బోనాలు, రంజాన్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతుందని చెప్పారు. బుద్ధగయ పేలుళ్ల తర్వాత మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం, నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని వెల్లడించారు. సీపీ అనురాగ్‌ శర్మ బషీర్‌బాగ్‌లోని తన కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. రంజాన్‌, బోనాల పండుగలకు నగరంలో ఎంతో విశిష్టత ఉందని, చాలా వైభవంగా వేడుకలు నిర్వహిస్తారన్నారు. వరుస పండుగల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్ర ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పవిత్ర మాసమైన రంజాన్‌ ముగిసే వరకూ పాతబస్తీ సహా సున్నిత, అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గతానుభవాల దృష్ట్యా భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమన్నారు. జంటనగరాల్లో సీసీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశామన్నారు. బుద్ధగయ పేలుళ్ల తర్వాత మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం, నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత వరకూ అందర్ని సమన్వయం చేసుకొని పని చేస్తామన్నారు. భద్రత విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.