ఆ భారం మేం బరించలేం


ఆహార భద్రత బరువు ఢిల్లీపైనే
కేంద్రం మోయాలని కోరిన సీఎం కిరణ్‌
హైదరాబాద్‌, జూలై 10 (జనంసాక్షి) :
ఆహార భద్రత భారం తాము మోయలేమని కేంద్రమే ఆ బరువు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ ఆహార భద్రత పథకం అమలు ద్వారా రాష్ట్రంపై రూ.1500 నుంచి రూ.1800 కోట్ల వరకూ అదనపు భారం పడనుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అదనపు భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరాలని నిర్ణయించింది. జాతీయ ఆహార భద్రత పథకంపై బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయించారు. ఆహార భద్రత పథకం అమలుపై సీఎం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆహార భద్రత పథకం వల్ల రాష్ట్రంలో చాలా మందికి లబ్ధి చేకూరనుందని, దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడనుందని ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతానికంటే రెట్టింపు మొత్తంలో బియ్యం పంపిణీ పెరుగుతుందని వివరించారు. ఆహార భద్రత పథకం వల్ల రాష్ట్రంపై రూ1500 నుంచి రూ.1800 కోట్ల వరకూ అదనపు భారం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వమే భరించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంపై పడే అదనపు భారాన్ని భరించాలని కేంద్రాన్ని కోరాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 13న ఢిల్లీలో జరిగే ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్‌ల సమావేశంలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. 13న సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలనూ ఈ సమావేశంలో ఖరారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, ఆర్థిక సాయం కోరాలని నిర్ణయించారు. అలాగే, ఆహార భద్రతా పథకం అమలు వల్ల రాష్ట్రంలో ఇస్తున్న బియ్యం కోటా పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో బియ్యం కోటాపై స్వేచ్ఛను రాష్టాన్రికే ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలని సీఎం భావిస్తున్నారు.జాతీయ ఆహార భద్రత పథకం అమలు వల్ల రాష్ట్రంపై రూ.1800 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. సీఎం సవిూక్షా సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంపై పడే భారాన్ని భరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. ఆహార భద్రతపై రాష్టాల్రకే స్వయంప్రతిపత్తి ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు. రాజకీయ దురుద్దేశంతోనే అమ్మహస్తం బ్యాగులపై ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయని ఆరోపించారు. తొమ్మిది నిత్యావసర వస్తువులు పేదవారికి అందకూడదనే ఈసీకి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం అమ్మహస్తం బ్యాగులను పంపిణీ చేయడం లేదని తెలిపారు. బ్యాగుల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈసీకి వివరణ ఇస్తారని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు ఆధార్‌ అనుసంధానం ద్వారా 30 శాతం బోగస్‌ కార్డులు తొలగిపోతాయన్నారు.