బుద్ధగయను సందర్శించిన సోనియా, షిండే


అన్ని కోణాల్లో పేలుళ్ల కేసు దర్యాప్తు : షిండే
బుద్ధగయా, జూలై 10 (జనంసాక్షి) :
ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం బుద్ధగయను బుధవారం యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే సందర్శించారు. బుద్ధగయా పేలుళ్ల ఘటనలో మావోయిస్టుల పాత్ర సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఈ సందర్భంగా సుశీల్‌కుమార్‌ షిండే వెల్లడించారు. అన్ని ప్రముఖ ప్రార్థన స్థలాలకు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. దుండగలు గ్యాస్‌ సిలిండర్లు, బాల్‌ బేరింగ్స్‌ ఉపయోగించి బాంబులు పేల్చారని చెప్పారు. ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఖండించిన షిండే.. ప్రార్థన స్తలాల్లో పేలుళ్లకు పాల్పడడాన్ని గర్హనీయమన్నారు. బుద్ధగయా పేలుళ్ల కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలన్న బీహార్‌ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించిందని, ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందన్నారు. బీహార్‌లోని మహాబోధి ఆలయంలో పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో కలిసి షిండే బుధవారం సందర్శించారు. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాలను వారు పరిశీలించారు. అనంతరం పేలుళ్లలో గాయపడిన వారిని పరామర్శించారు. షిండే విలేకరులతో మాట్లాడుతూ… అప్రమత్తంగా ఉండాలని గతంలోనే బీహార్‌ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించిందన్నారు. బుద్ధగయ పేలుళ్ల కేసును జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తోందన్నారు. ‘ముగ్గురు, నలుగురి పాత్ర ఉందని వారిని విచారిస్తున్నాం. వరుస పేలుళ్ల కేసులో ఇప్పటివరకూ ఎవరిని అరెస్టు చేయలేదని’ చెప్పారు. ఫ్లైట్‌ ఆలస్యం కావడం వల్లే ఎన్‌ఐఏ బృందం ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఆలస్యమైందన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. దుండగులు ఖాళీ సిలిండర్లలో బాల్‌ బేరింగ్స్‌ నింపి పేలుళ్లకు పాల్పడ్డారన్నారు. దాడికి ముందురోజు రాత్రి ఆలయంలో వాటిని ఉంచారని చెప్పారు. మొత్తం 13చోట్ల బాంబులు పెట్టారని, వాటిలో 10 పేలాయన్నారు. దాడులు జరిగే అవకాశముందని కేంద్రం, ఢిల్లీ పోలీసులు జూలై 3న బీహార్‌ పరభుత్వాన్ని హెచ్చరించారని తెలిపారు. మరోవైపు, బుద్ధగయా పేలుళ్లకు పాల్పడింది తామేనని ఇండియన్‌ ముజాహిదీన్‌ సంస్థ ప్రకటించింది. వరుస పేలుళ్లు తమ పనేనని ట్విట్టర్‌లో వెల్లడించింది. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే తమ లక్ష్యమని పోస్టు చేసింది. త్వరలో ముంబైలో పేలుళ్లకు పాల్పడతామని ఇండియన్‌ ముజాహిదీన్‌ సవాల్‌ విసిరింది. దీంతో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) ట్విట్టర్‌పై దృష్టి సారించింది. ముజాహిదీన్‌ పేరుతో వచ్చిన పోస్టు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై ట్విట్టర్‌ సంస్థ సాయం కోరింది. ఇప్పటికే ఇదిలా ఉంటే, బుద్ధగయా పేలుళ్ల కేసులో అరెస్టు చేసిన నలుగురు అనుమానితులను పోలీసులు బుధవారం విడుదల చేశారు. పేలుళ్లతో వీరికి సంబంధం లేదని దర్యాప్తులో తేలడంతో వీరిని విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. బుద్దగయలో సీసీ టీవీఫుటేజ్‌ ఆధారంగా నలుగురిని మంగళవారం పాట్నాలో అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. వీరిని ఎన్‌ఐఏ, ఐబీ అధికారులు ప్రశ్నించారు. పేలుళ్లతో వీరికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వారిని వదిలిపెట్టారు.