ఉండవల్లి నువు ఊసరవెల్లి

దమ్ముంటే బహిరంగ చర్చకురా
హరీశ్‌ సవాల్‌
హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) :
ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ అబద్ధాలనే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి రాజమండ్రిలో ఉండవల్లి నిర్వహించిన సభలో చేసిన ప్రసంగాలను, గత ప్రసంగాలతో జత చేసి ఎన్ని అబద్ధాలు మాట్లాడాడో విజువల్స్‌, వాయిస్‌ రూపంలో చూపించి వినిపించారు. నోరు తెరిస్తే అబద్ధాలు, నయవంచన తప్ప మరోటి ఆయనకు సాధ్యం కాదన్నారు. సాక్ష్యాలను వక్రీకరించి మసి పూసి మారేడు కాయ చేస్తున్నాడని ఆరోపించారు. ఆయన ఆరోపణల్లో హేతుబద్ధత లేదన్నారు. పోలవరం నిర్మాణంలో అడ్డువచ్చే గిరిజనులను కాల్చిచంపైనా సరే పూర్తిచేయాలని అన్నమాటలు వినిపించారు. నిన్నటికి నిన్న ఆ మాటలను కట్‌చేసి రాజమండ్రి సభలో చూపించారని, ఇంతకంటే పెద్ద అబద్ధం ఏం కావాలని ప్రశ్నించారు. తాను చూపిస్తున్నది యూ ట్యూబ్‌లో ఉన్న వ్యాఖ్యలేనని హరీష్‌రావు పేర్కొన్నారు. జలియన్‌ వాలాబాగ్‌లో చంపాలని పిలుపునిచ్చిన డయ్యర్‌లా మారింది మీరు కాదా అని నిలదీశారు. తెలంగాణ సాధించాలంటే ఏకాబిప్రాయం కావాలంటున్న ఉండవల్లి మరి పోలవరం విషయంలో మాత్రం గిరిజనులను ఎందుకు లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. ఇక్కడేమో జాతీయ దృక్పథం, దేశప్రయోజనాలు అంటూ మభ్య పెడుతున్నాడని ఆరోపించారు. పెద్ద ప్రజాస్వామ్యవాదిగా నాటకం ఆడుతున్నాడని ఆరోపించారు. ఆయన మాటల్లో ఎక్కడైనా కన్విన్సింగ్‌ ఉపన్యాసం ఉందేమో ఆంధ్రా వాదులనే అడిగి తెలుసుకోవాలన్నారు. వెటకారం, అపహాస్యం చేయడం, కించపరచడంలాంటి భావాలే తప్ప తెలంగాణాపై మరో భావన ఎక్కడా కనిపించలేదన్నారు. బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ ఇస్తే కొత్త రాష్టాల్ర డిమాండ్‌ పెరుగుతుందనడం అవివేకానికి నిదర్శనమన్నారు. ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా చిన్న రాష్టాల్ర డిమాండ్‌ కచ్చితంగా వస్తుందన్నారు. మహారాష్ట్ర నుంచి గుజరాత్‌ విడిపోయినప్పుడుగాని, పంజాబ్‌నుంచి హర్యానా విడిపోయినప్పుడుగాని, బీజేపీ హయంలో మూడు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు గాని ఎక్కడా విద్వేషాలు తలెత్తలేదని, దేశం అనిచ్చితికి గురికాలేదని గుర్తుంచుకోవాలన్నారు. కేవలం గుడ్డిగా వ్యతిరేకించడమే ఆయన అలవాటు చేసుకున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయం వచ్చినప్పుడల్లా ఇలాంటి వ్యవహారం చేస్తూనే ఉన్నాడన్నారు. కేసీఆర్‌ అబద్ధాలు మాట్లాడుతున్నాడని, లేనిపోని ఆరోపణలు చేస్తున్న ఉండవల్లికి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందన్నారు. అబద్ధాలు ఆడితే ఉద్యమం 12 ఏళ్లుగా ఎలా కొనసాగుతుందన్నారు. దేశాన్ని కదిలించిన సకల జనుల సమ్మె ఎలా సక్సెస్‌ అవుతుందన్నారు. 1952లో ఉద్యమం అవాస్తవమా, 1969లో ఉద్యమం, పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘన, లలిత్‌ కమిటీ, ముల్కి నిబంధనలు, ఆరు సూత్రాల పథకం ఉల్లంఘనలు అవాస్తవాలా అని ఆయన నిలదీశారు. ఉద్యమాలనేవి అన్యాయం నుంచి, వివక్షనుంచి పుట్టుకొస్తాయని గుర్తుంచుకోవాలన్నారు. మేం చెప్పేవి అన్ని అబద్ధాలైతే 2004లో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని నిలదీశారు. 2004లోనే కరీంనగర్‌లో సోనియాగాంధీ బహిరంగ సభలో తెలంగాణ ఇస్తామన్న మాటలను అనువాదం చేసింది నీవు కాదా అని ఆయన ప్రశ్నించారు. గోదావరి నీళ్లు తాగి అబద్ధం ఆడలేదనడం కూడా పూర్తి అబద్ధమేనన్నారు. తెలంగాణ ఇస్తామని ఆనాటి నుంచి 2009 డిసెంబర్‌ 9 నాటికి కూడా కాంగ్రెస్‌ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిందని, ఏమైనా అడుగాలనుకుంటే కాంగ్రెస్‌ అధిష్టానాన్ని అడగాలన్నారు. కేసీఆర్‌ మాటలను కూడా ఉండవల్లి వక్రీకరించారన్నారు. 1955-56లో తెలంగాణ 68లక్షల ఎకరాలు సాగు అయ్యేదని నేడు 1.30 కోట్ల ఎకరాలు సాగవుతుందని ప్రకటించడం పెద్ద అబద్ధం కాదా అని నిలదీశారు. శ్రీకృష్ణ కమిటీ నియమించిన మొహాలే చెప్పిన నివేదికలు చూసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆనాడు కాలువల ద్వారా 2.50లక్షల ఎకరాలు, పదిలక్షల ఎకరాలు చెరువుల ద్వారా, బోర్ల ద్వారా మరో 5లక్షల ఎకరాలు సాగయ్యేదని చెప్పింది కూడా తప్పేనా అని ఉండవల్లిని నిలదీశారు. 2008-09 నాటికి కాలువల ద్వారా 5లక్షల ఎకరాలు, ట్యాంక్‌లద్వారా అయిదు లక్షల ఎకరాలు తగ్గిందని మొత్తం  50లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతుందని శ్రీకృష్ణ కమిటి చెప్పింది కూడా అవాస్తవమేనా అని హరీశ్‌ ప్రశ్నించారు. కృష్ణా నదిలోకూడా తెలంగాణా వాడుకుంటున్నదన్న వ్యాఖ్యలు అవాస్తవమేనన్నారు. లెక్కలు కావాలంటే శ్రీకృష్ణ కమిటీ నివేదికలు పరిశీలించుకోవాలని సూటిగా హితవు పలికారు. తెలంగాణ ఆదాయం ఎక్కువుందన్న తమ వాదనలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. 1955-56లో పర్‌ క్యాపిటా ట్యాక్స్‌ రెవెన్యూ ఆంధ్రాకంటే 75 శాతం ఎక్కువన్నారు. నేడు కూడా 200శాతం పెరిగిందన్నారు. హైదరాబాద్‌ రాష్ట్రంలోను నేడు కూడా అర్బనైజేషన్‌ ఎక్కువన్నారు. పారిశ్రామికంగా ఎదిగిన ప్రాంతంతమదన్నారు. తెలంగాణలో 24శాతం అర్బనైజేషన్‌ ఉంటే ఆంధ్రాలో 13 శాతం ఉందన్నారు. సర్వీస్‌ సెక్టర్‌, పరిశ్రమలు తెలంగాణాలోనే ఎక్కువగా ఉన్నాయని దీనివల్లే ఆంధ్రాకంటే ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. కేవలం తెలంగాణను అడ్డుకునేందుకే ఉండవల్లి లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లుగా మసి పూసి మారేడు కాయలా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి చేసి తెలంగాణ రాకుండా చూడాలన్నదే ఆయన అభిమతం తప్ప తెలంగాణా ప్రజల ఉద్యమం, ఆరాటం, ఆత్మగౌరవం ఆయనకు పనికి రావన్నారు. ఇప్పటికైనా కేంద్రం నిర్లక్ష్యం చేస్తే మాత్రం తప్పక మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇప్పుడు కాక పోయినా రేపైనా తెలంగాణ వచ్చి తీరుతుందన్నారు. ఉండవల్లి లాంటి వారు వందమంది అడ్డుపడ్డా కూడా రాష్ట్రం ఏర్పడడం ఖాయమన్నారు. ప్రజల్లో ఉద్వేగాలు పెంచడం సరైంది కాదన్నారు.