జుడిషియల్‌ కస్టడీలో ఉన్న అనర్హులే

జైలు నుంచి పోటీకి నేతలు పనికిరారు
సుప్రీం మరో సంచలన తీర్పు
న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) :
జైల్లో ఉండి కూడా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులగా చెలామణీ అవుదామనుకున్న వారికి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. జైలులో లేదా పోలీస్‌ కస్టడీలో ఉన్న వ్యక్తి చట్ట సభలకు పోటీ చేయడానికి అనర్హుడని గురువారం సుప్రీం కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. దీంతో జైళ్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే విచారణ ఖైదీ రాజకీయ నాయకుల అంకానికి తెరపడినట్లే. పోలీస్‌ కస్టడీలో ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధిస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎ.కె.పట్నాయక్‌, ఎస్‌.జె.ముఖోపాధ్యాయులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ మేరకు తీర్పును వెలువరించింది. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, ఇతర చట్ట సభలలో నేరస్తులు ప్రవేశించడాన్ని నిరోధిస్తూ కేవలం ఓటరు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడని, జైల్లోనూ లేదా పోలీస్‌ కస్టడీలో ఉన్న వ్యక్తులు ఓటు వేసే హక్కును కోల్పోతారని ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. అయితే ఏదైనా చట్టం ప్రకారం ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్న వ్యక్తికి ఈ అనర్హత వర్తించదని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 4,5,62(5) సెక్షన్ల ప్రకారం జైల్లో ఉన్న లేదా పోలీస్‌ కస్టడీలో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయలేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రస్తుతం జైళ్లలో అండర్‌ ట్రయల్‌ ఖైదీలుగా ఉన్న వారంతా పోటీ చేసే అవకాశం కోల్పోతారు. దేశవ్యాప్తంగా మూడో వంతు రాజకీయ నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడమో, క్రిమినల్‌ కేసుల్లో నిందితులుగానో ఉన్నారు. ఇప్పుడు వారంతా జైలు గోడలకే పరిమితం కాక తప్పని పరిస్థితి నెలకొంది. మొత్తానికి సుప్రీం కోర్టు జైలు పక్షుల విషయంలో ఇచ్చిన రెండు తీర్పులు చారిత్రాత్మకమని ప్రజాస్వామికవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.