జమ్మూ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

శ్రీనగర్‌, జూలై 11 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాత సచివాలయం ప్రాంగణంలోని రెండంతస్తుల భవనంలో గురువారం మంటలు చెలరే గాయి. క్షణాల్లోనే భవనమంతటికీ మంటలు విస్తరించాయి. ఈ ప్రమాదం లో కీలక పత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆరు అంతస్తుల భవనంలో అనుమానాస్పద స్థితిలో మంటలు ప్రారంభమయ్యాయి. కార్యాలయాలు తెరుచుకొనే 9.30 గంటల సమయంలో మొదలైన మంటలు నిమిషాల వ్యవధిలో మొత్తం భవనాన్ని చుట్టుముట్టాయి. ఈ భవనంలో ఉన్న పలు కార్యలయాలు పూర్తిగా దహనమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రధాన కాంప్లెక్స్‌తో పాటు ఇతర భవనాలకు మంటలు వ్యాప్తి చెందకుండా నియంత్రించారు. 12 ఫైరింజన్ల తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, మంత్రులు, ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతా ధికారుల కార్యాలయాలన్నీ ప్రధాన కాంప్లెక్స్‌లో ఉన్నాయి. కార్యాలయాలు తెరుచుకొనే సమయంలో మంటలు చెలరేగడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. అదే 10 గంటల తర్వాత ప్రమాదం జరిగి ఉంటే ఊహించని స్థాయిలో నష్టం జరిగి ఉండేది. సచివాలయంలో  3 వేల మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు.