వీడని మతతత్వం నేను హిందూ జాతీయవాదిని : మోడీ


అహ్మదాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) :
జాతీయవాదినంటూ చెప్పుకునే గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన మతతత్వాన్ని మాత్రం వీడలేదు. తాను హిందూ జాతీయవాదినని పేర్కొన్నారు. పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమితులైన అనంతరం మోడీ మొదటిసారిగా గాంధీనగర్‌లోని తన నివాసంలో రాయిటర్స్‌ ఏజెన్సీకి  ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన మనోభావాలు పంచుకున్నారు. తాను హిందూ జాతీయవాదినని.. అందుకు కారణం హిందువుగా పుట్టడమేనని అన్నారు. తాను హిందువుగా పుట్టానని, అందువల్ల హిందువుగా చెప్పుకోవడంలో తప్పులేదన్నారు. తాను దేశభక్తుడినని, పుట్టుకతో హిందువునని అందులో తప్పేమీ లేదు కదా? అని ప్రశ్నించారు. తనను ప్రగతిశీలవాది, అభివృద్ధికాముకుడినని అంటారని, పని రాక్షసుడు అని కూడా అంటారని వెల్లడించారు. ప్రగతిశీల భావనతో పనిచేస్తే వైరుద్ద్యాలు ఎక్కడుంటాయని అన్నారు. భారత దేశం ప్రజాస్వామ్య దేశమని.. ప్రతి ఒక్కరికి ఆలోచించే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. పాలనకు సంబంధించి తాను అనేక సంస్కరణలు  చేపట్టానన్నారు. అంతేగాకుండా గతంలో జరిగిన సంఘటనలకు పావ్చాత్తాపం చెందడం లేదని కూడా అన్నారు.తనకు వ్యక్తిగత అజెండాలు లేవని అభివృద్ధే తన ఎజెండా అని అన్నారు.