పుతిన్‌ షరతులు ఒప్పుకుంటా రష్యాలోనే ఉంటా : స్నోడెన్‌


మాస్కో, (జనంసాక్షి) :
రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌ విధించిన షరతులకు లోబడి రష్యాలోనే తలదాచుకుంటానని అమెరికా గూఢచర్య రహస్యాలు బట్టబయలు చేసిన ఎడ్వర్డ్‌ సోడ్రెన్‌ పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం ఆయన మాస్కోలోని షెర్‌మట్యేవో విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. వికీలీక్స్‌ ప్రతినిధి సరహ్‌ హరిసన్‌తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అమెరికా గూఢచర్య రహస్యాలు బాహ్య ప్రపంచానికి చేరవేయడం ఆపితే మాస్కోలో ఆశ్రయం కల్పిస్తామన్న పుతిన్‌ షరతురు తాను అంగీకరిస్తున్నట్లు ప్రకటించాడు. స్నోడెన్‌ను అప్పగించాలని అమెరికా రష్యాను ఇదివరకే కోరిన విషయం తెలిసిందే. అమెరికా భారత్‌ సహా 40కి పైగా దేశాల దౌత్య కార్యాలయాలపై ఈమేరకు నిఘా పెట్టిన విషయం కూడా విధితమే. తనకు ఆశ్రయం ఇవ్వాలన్న స్నోడెన్‌ వినతిని భారత్‌ సహా పలు దేశాలు తిరస్కరించగా లాటిన్‌ అమెరికాలోని నికరాగ్వా, వెనిజుల అందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే అమెరికాతో విభేదించే దేశాల్లో ఆశ్రయం పొందడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఆయన సన్నిహితులు సూచించినట్టు సమాచారం. స్నోడెన్‌కు మద్దతుగా రష్యాకు చెందిన 13 మంది హక్కుల నేతలు అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి పెంచిన విషయం తెలిసిందే. షెర్‌మట్యేవో విమానాశ్రయంలో 19 రోజులుగా ఆశ్రయం పొందుతున్న స్నోడెన్‌ అమెరికా వ్యతిరేక కార్యకలాపాలు మానుకుంటే ఇక్కడే ఉండొచ్చని పుతిన్‌ పేర్కొన్నారు. అతడి ప్రతిపాదనకు స్నోడెన్‌ అంగీకరించడంతో వివాదానికి ప్రస్తుతానికి తెరపడింది.