బతిమిలాడం మన బలంతోనే తెలంగాణ


ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకూ పోరు ఆగదు : కోదండరామ్‌
హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరిని బతిలాడబోమని, ఎవరి దయతోనో ప్రత్యేక రాష్ట్రం రాదని, మన బలంతోనే తెచ్చుకుందామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ కమిటీ సమావేశం అనంతరం శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీపై పోరాడి తెలంగాణను తెచ్చుకుందామన్నారు. ప్రతిసారి ఏదో ఒక బూచీ చూపుతూ నాన్చివేత ధోరణికి కాంగ్రెస్‌ పార్టీ పాల్పడుతోందన్నారు. భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకుని కాంగ్రెస్‌పార్టీపై ఒత్తిడి పెంచి అనుకున్నది సాధించుకుందామని, ఎవ్వరూ ఎలాంటి నిస్పృహలకు లోనుకావొద్దని కోరుతున్నానని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మరో సారి మోసం చేసిందని ఎవరూ భావోద్వేగాలకు లోను కావొద్దని కోరారు. మోసం చేయడం కాంగ్రెస్‌కు మామూలే.. ఆ పార్టీని బొందపెడదాం.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందాం అని తెలంగాణ ప్రాంత యువకులకు పిలుపునిచ్చారు. దిగ్విజయ్‌సింగ్‌ మీడియా సమావేశం పూర్తయిన తర్వాత టీ జేఏసీ నాయకులు శుక్రవారం రాత్రి స్పందించారు. కోదండరామ్‌తో పాటు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్‌, దేవిప్రసాద్‌ తదితరులు మాట్లాడారు. నాన్చుడు ధోరణికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. 12వ తేదీన తాము అనుకున్నది నెరవేరనున్నదని యువకులు, తెలంగాణవాదులు ఎదురు చూశారని అన్నారు. వారి ఆశయలపై కాంగ్రెస్‌ పార్టీ నీళ్లు చల్లిందన్నారు. త్వరలో సమావేశమై కార్యాచరణ రూపొందించుకుని ఐక్యంగా పోరాడి సాధించుకుంటామని అన్నారు.