దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు పురోగతి


యాసిన్‌ భత్కల్‌ పాల్గొన్నట్లు ఆధారాలు
ఫోరెన్సిక్‌ బృందం నివేదిక
హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) :
దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లలో కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ పేలుళ్లకు పాల్పడింది భత్కల్‌ సోదరులేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వెల్లడించింది. ఈ పేలుళ్లలో ఇండియన్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ యాసిన్‌ భత్కాల్‌ స్వయంగా పాల్గొన్నాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. అయితే, మరో బాంబును తెహసిన్‌ అక్తర్‌ పెట్టి ఉంటాడని భావిస్తున్నట్లు పేర్కొంది. అయితే, అందుకు సంబంధించిన సీసీ టీవి కెమెరా ఫుటేజ్‌లను ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలిస్తున్నారని ఎన్‌ఐఏ శనివారం వెల్లడించింది. దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లకు సంబంధించి ఫోరెన్సిక్‌ విభాగం ఎన్‌ఐఏకు నివేదిక సమర్పించింది. పేలుడు జరగడానికి ముందు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్‌ విభాగం నిపుణులు.. పేలుళ్లకు కుట్ర పన్నింది తీవ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ అని తేల్చారు. పేలుడు జరగడానికి కొద్దిసేపటి ముందు యాసిన్‌ భత్కల్‌ స్వయంగా ఘటనా స్థలం వద్దకు సైకిల్‌పై వచ్చినట్లు గుర్తించారు. సైకిల్‌ వెనుక భాగంలో భారీ సంచి కూడా తగిలించి ఉన్నట్లు నిర్ధారించారు. మరో చోట బాంబు అమర్చిన  వ్యక్తిని తెహసీన్‌గా అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం రద్దీగా ఉన్న సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌లో రెండు భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు అత్యంత రద్దీగా ఉండే ఏ-వన్‌ మిర్చి బండి వద్ద, 107 బస్టాప్‌ వద్ద రెండు శక్తివంతమైన బాంబులు పేల్చారు. ఈ ఘటనలో 17 మంది మృత్యువాత పడగా, 119 మంది తీవ్రంగా గాయపడ్డారు. కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ రంగంలోకి దిగింది. జంట పేలుళ్లపై దర్యాప్తును ముమ్మరం చేసింది. శక్తివంతమైన పేలుడు పదార్థాలతో రూపొందించిన ఇంప్రూవైజ్డ్‌ ఎక్ల్పోజివ్‌ డివైస్‌ (ఐఈడీ)తో పేలుళ్లకు పాల్పడ్డాయని ప్రాథమికంగా నిర్ధారించింది. పేలుళ్లు జరిగిన సమయం, సంఘటనా స్థలాల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల ఆధారంగా.. ఇది ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) పనేనని నిర్ధారణకు  వచ్చినప్పటికీ, స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో అధికారికంగా ప్రకటించలేదు. దాడుల వెనుక రియాజ్‌ భత్కాల్‌ హస్తం ఉన్నట్లు తొలుత భావించినా సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను బట్టి యాసిన్‌ భత్కాల్‌ స్వయంగా పాల్గొన్నట్లు గుర్తించారు. బాంబు పేలుళ్లు జరిగిన రోజు సైకిల్‌ తీసుకువచ్చిన వ్యక్తులకు సంబంధించి సీసీకెమెరాల ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరీక్షించిన ఫోరెన్సిక్‌ నిపుణులు యాసిన్‌ను గుర్తించారు. అయితే, జంట బాంబు పేలుళ్ల కేసులో మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని.. పూర్తి ఆధారాలు దొరికాక బాంబు పేలుళ్ల నిందితుల పేర్లు వెల్లడిస్తామని ఎన్‌ఐఏ ప్రకటించింది.