మత ప్రాతిపదికన దేశ ప్రజల్ని విడదీయొద్దు


భారతీయుడిగా జీవించలేవా?
మోడీకి దిగ్విజయ్‌ చురక
న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) :
మత ప్రాతిపదికన దేశ ప్రజలను విడదీయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని, లౌకిక దేశంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం దౌర్భాగ్యమని ఏఐసీసీ ప్రధాని కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. తాను హిందూ జాతీయవాదినని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై దిగ్విజయ్‌ మండిపడ్డారు. భారతీయుడిగా జీవించలేవా? అంటూ ప్రశ్నించారు. హిందువులు భారతీయులేనని, వారిని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసే నీచ ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. లౌకిక దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓట్లు కొళ్ల గొట్టాలని చూడటం సరికాదన్నారు. ముస్లిం మైనార్టీలపై మోడీ వ్యాఖ్యలు అత్యంత ఘోరంగా ఉన్నాయని అన్నారు. ప్రజలను కుక్కపిల్లలతో చూడటం భారతీయ సంస్కృతిలో భాగం కాదని, బీజేపీ ఇలాంటి వ్యాఖ్యలను ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. ప్రజల మధ్య విభజన, విభేదాలు తీసుకురావడానికి విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీకి కొత్తేమి కాదని, మోడీ దానిని మరింత హీన స్థితికి చేర్చారని మండిపడ్డారు. ప్రజలను బిడ్డలుగా చూడాల్సిన పాలకులు వారిపై హత్యాఖండ సాగించడమే కాకుండా ఇలా కించపరచడం అన్యాయమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి దేశ ప్రజలు తగినరీతిలో బుద్ధి చెప్పి తీరుతారని హెచ్చరించారు.