రాజీవ్‌ జన్మదిన కానుకగా


ఆహార భద్రత చట్టం
కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు
సమీక్షించిన సోనియా, మన్మోహన్‌
న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) :
రాజీవ్‌గాంధీ జన్మదిన కానుకగా ఆహార భద్రత చట్టం ప్రారంభిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తుందన్న నమ్మకంతో యూపీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోయే ఆహార భద్రత చట్టం తొలుత కాంగ్రెస్‌ పాలిత రాష్టాల్ల్రో అమల్లోకి రానుంది. మూడొంతుల జనాభాకు అత్యంత తక్కువ ధరకు ఆహార ధాన్యాలు అందుబాటులోకి తీసుకువచ్చే ఈ చట్టం గురించి విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆహార భద్రతా చట్టం ప్రచారం భారీగా చేపట్టాలని కాంగ్రెస్‌ అధినేత్రి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చట్టం రాజీవ్‌గాంధీ జయంతి అయిన ఆగస్టు 20 నుంచి అమల్లోకి రానుందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, వాటిని కాంగ్రెస్‌ పార్టీ తోసిపుచ్చింది. ఆహార భద్రతా చట్టం గురించి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్‌ పాలిత ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నాయకులతో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆహార భద్రత చట్టం ప్రాముఖ్యాన్ని పార్టీ నేతలకు వివరించారు. సోనియా నివాసం టెన్‌-జన్‌పథ్‌లో జరిగిన ఈ భేటీకి కోర్‌ కమిటీ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆహార మంత్రి కేవీ థామస్‌, రాహుల్‌గాంధీ, 14 రాష్టాల్ర ముఖ్యమంత్రులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు సహా మొత్తం 34 మంది హాజరైన ఈ భేటీలో సోనియా.. 2014 ఎన్నికలే లక్ష్యంగా దిశానార్దేశనం చేశారని సమాచారం. దేశంలో 82 కోట్ల మంది జనాభాకు అత్యంత తక్కువ ధరకు ఆహార ధాన్యాలు అందించే ఈ చట్టం ముఖ్యోద్దేశ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి లబ్ధి చేకూర్చేలా చూడాలని ఆదేశించినట్లు తెలిసింది. తొలుత కాంగ్రెస్‌ రాష్టాల్ల్రోనే ఈ చట్టం అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు కురిపిస్తాయని భావిస్తున్న ఆహార భద్రతా బిల్లును పార్లమెంట్‌లో ఎలా గట్టెక్కించుకోవాలనే అంశంపైనా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.