కాంగ్రెస్‌ మోసంపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు


గాంధీభవన్‌ ముట్టడి
విద్యాసంస్థల బంద్‌ విజయవంతం
హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై మరోసారి వాయిదా వేసే దోరణితోనే వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈ ప్రాంతంలోని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ యువత జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన విద్యాలయాల బంద్‌ పిలుపు సక్సెస్‌ అయింది. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణలోని విద్యాలయాలన్నీ మూసివేశారు.  తెలంగాణను వాయిదా వేసేందుకే కాంగ్రెస్‌ కంకణం కట్టు కుందని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. కావాలనే వాయిదా వేస్తూ వచ్చారని, సీమాంధ్ర నేతల ఒత్తిళ్లకు మరోసారి తలొగ్గిందని ఆరోపిస్తున్నారు. విద్యాసంస్థల బంద్‌ను యాజమాన్యాలే స్వచ్ఛందంగా పాటించడంతో విద్యార్థి సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరన ప్రదర్శనలు చేయడమేకాక, దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలను ఇంకెంతకాలం చంపుతూ ఉంటారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ కోర్‌కమిటీ కాదదని చోర్‌కమిటీ మాత్రమేనన్నారు. ఆందోళనలో బాగంగా ఓయు జేఏసీ నేతలు హైదరాబాద్‌ లోని గాంధీభవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు.అప్పుడే పోలీసులు రావడంతో ఆకార్యక్రమం చేపట్టలేక పోయారు. కాంగ్రెస్‌ను బొందపెడతామని, తెలంగాణ తెచ్చుకుంటామన్నారు. సర్పంచ్‌ ఎన్నికల కోసమే కాంగ్రెస్‌ పార్టీ నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. సోనియాగాంధీ ఇటలి నుంచి వచ్చి దయ్యంలా మారిందని ద్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమాల్లో 1969లో చనిపోయిన 360 మంది ప్రాణాలకు, నేడు వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన కాంగ్రెస్‌ను వూరికే వదిలేయమన్నారు. ఏ కమిటీల్లో చర్చించుకుంటారో మాకు అనవసరమని, తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించడమేకాక, ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే కాంగ్రెస్‌ దిష్టిబొమ్మను మాత్రం దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళనకారులను బేగంపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.