జనం రారని… కాంగ్రెస్‌ సమైక్యాంధ్ర సభ లేదు


కేంద్రం చర్యలతో తృప్తిపడ్డామని నొక్కులు
అనంతపురం, జూలై 14 (జనంసాక్షి) :
సమైక్యాంధ్ర పేరుతో అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్‌ సభను ఆ పార్టీ సీమాంధ్ర ప్రాంత నేతలు రద్దు చేసుకున్నారు. నేతల సమావేశానికే స్పందన కరువైన నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో సభ పెట్టుకుంటే ఎవరొస్తారనే భయంతో సభను రద్దు చేసుకున్నట్లు సమాచారం. పైకి మాత్రం పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజన ఉండబోదన్నట్లు స్పష్టమైన సూచనలు ఇవ్వడంతోనే సభను రద్దు చేసుకున్నట్లు సమైక్యాంధ్ర ఉద్యమ నేతగా వ్యవహరిస్తున్న మంత్రి శైలజానాథ్‌ వెల్లడించారు. మంగళవారం అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. కానీ పార్టీ కోర్‌కమిటీలో తెలంగాణపై స్పష్టత ఇవ్వనందున సభను రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అయితే పంచాయితీ ఎన్నికలు ఉన్నందునే సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇది బోగస్‌ కారణమేనని ప్రతిఒక్కరికి అనుమానాలు కలుగుతున్నాయి. కేవలం కాంగ్రెస్‌ హైకమాండ్‌ అడుగులు మరో నెలరోజుల వరకు కూడా తెలంగాణపై ఆలోచించే పరిస్థితి లేకపోవడంతోనే వాయిదా వేశారనేది వాస్తవం. ఇప్పుడే లక్షలు వెచ్చించి సభను పెడితే ఫలితం ఉండక పోగా, కాంగ్రెస్‌ మరిచిపోయే ప్రమాదం ఉందని బావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా సమైక్యాంద్ర సభ వాయిదా పడడంతో సీమాంధ్రనేతలు ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు