టెలిగ్రాఫ్‌ ఇక కనబడదు నష్టాల పేరుతో మంగళం


160 ఏళ్ల సేవలకు విరామం
న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) :
కబురెలాంటిదైనా అతిస్వల్పకాలంలో ప్రజల చెంతకు చేర్చిన ఆత్మీయ నేస్తం టెలిగ్రాఫ్‌ ఇక కనబడదు. 160 ఏళ్లుగా ప్రజలకు సమాచార వారధిగా సేవలందించిన టెలిగ్రాఫ్‌ సేవలకు సోమవారం నుంచి సర్కారు మంగళం పాడింది. ఇందుకు నష్టాలను సాకుగా చూపింది. దీంతో ప్రజలు, టెలిగ్రాఫ్‌కు మధ్య బంధం తెగిపోయింది. ఫ్రాన్స్‌ శాస్త్రజ్ఞుడు క్లాడ్‌ చాపే టెలిగ్రాఫ్‌ను రూపొందించాడు. 1844, మే 24న వాషింగ్టన్‌ నుంచి మోర్స్‌ ప్రపంచానికి పరిచయం చేశాడు. భారతదేశంలో ఈ సేవలు 1850లో ప్రారంభమయ్యాయి. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో విశేష సేవలందించింది.
160 ఏళ్ల వైభవం నూతన సాంకేతిక పరిజ్ఞానం తాకిడితో క్రమేణా మసకబారుతూ వచ్చింది. టెలిగ్రాఫ్‌ యంత్రం, టెలిగ్రామ్‌కు భారత్‌తో ఉన్న అనుబంధం ఇదీ…
– టెలిగ్రామ్‌ అనే పదాన్ని సృష్టించిన ఘనత ఫ్రాన్స్‌ శాస్త్రజ్ఞుడు క్లాడ్‌ చాపేకు దక్కుతుంది.
– టెలిగ్రామ్‌ అంటే మనకు చేరే సందేశం.. ఈ సందేశాన్ని చేరవేసే యంత్ర సామాగ్రే ‘టెలిగ్రాఫ్‌’
– 1792లో క్లాడ్‌చాపే ‘సెమాఫోర్‌’ విధానాన్ని కనుగొన్నాడు. యాంటినా లాంటి పరకరాన్ని మార్చే తీరును బట్టి అక్షరాలను సూచించేవారు..ఇదే తొలి నాన్‌ ఎలక్ట్రిక్‌ టెలిగ్రాఫ్‌
– 1832లో రష్యాకు చెందిన పావెల్‌ షిల్లింగ్‌ ఎలక్ట్రిక్‌ టెలిగ్రాఫ్‌ను ఆవిష్కరించాడు.
– అమెరికాకు చెందిన శామ్యూల్‌ మోర్స్‌ సింగిల్‌ వైర్‌ ఎలక్ట్రిక్‌ టెలిగ్రాఫ్‌ను కనుగొన్నాడు.
– 1844, మే 24న మోర్స్‌ వాషింగ్టన్‌ నుంచి తన మొదటి సందేశాన్ని పంపాడు
– 1865లో దానికి అంతర్జాతీయ ఆమోదం లభించింది.
– 1848-56 మధ్య భారత గవర్నర్‌ జనరల్‌గా పనిచేసిన డల్హౌసి ఈ పరిజ్ఞానాన్ని గుర్తించాడు. అభివృద్ధికి కృషి చేశాడు.
– 1856 నాటికి కోల్‌కతా, ఆగ్రా, బొంబాయి, పెషావర్‌, మద్రాసు, ఊటీ, బెంగళూరులను కలుపుతూ సేవలు విస్తరించాయి.
– 1857నాటి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తోడ్పడింది.

– అతి తక్కువ ధరలో.. అతి వేగంగా సమాచారాన్ని పంపడానికి ఉత్తమ ప్రత్యామ్నాయం మరొకటి లేకపోయింది.
– టెలిఫోన్‌ రాకతో టెలిగ్రాఫ్‌ వేగం మందగించింది.
– 1995లో మొబైల్‌ ఫోన్లు, ఇంటర్‌నెట్‌ ప్రవేశించాక.. సమాచార వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి
– ఫ్యాక్సులు, ఇ-మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి.
– ప్రత్యేక సందర్భాల్లో మినహా టెలిగ్రాఫ్‌ను వినియోగించడం తగ్గిపోయింది.
– టెలిగ్రాఫ్‌ కార్యాలయాల సంఖ్య క్రమేపి తగ్గిపోయింది.
– బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధీనంలోని టెలిగ్రాఫ్‌ విభాగం నష్టాల బాట పట్టింది
– ఏటా 300-400 కోట్ల రూపాయల మేర నష్టాన్ని చవిచూస్తోంది
– 2010లో వెబ్‌ ఆధారిత సేవలను ప్రారంభించింది. అయినా ప్రయోజనం చేకూరలేదు.
– 2011, మేలో ధరలను సవరించింది.. ఐనా ప్రయోజనం లేదు..
– రెండు నెలల క్రితం విదేశాలకు టెలిగ్రామ్‌ సేవలను నిలిపేసింది.
– శాశ్వతంగా నిలిపేయాలని బిఎస్‌ఎన్‌ఎల్‌ భావించింది..
– 2013, జులై 15 నుంచి బుకింగ్స్‌ నిలిపేయాలని అన్ని తంతి కార్యాలయాలకు టెలిగ్రాఫ్‌ సర్వీసుల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.