కాంగ్రెస్‌ను నమ్మలేం


తెలంగాణ సాధించేవరకూ పోరు కొనసాగించాలి : కేసీఆర్‌
టీఆర్‌ఎస్‌లోకి వేణుగోపాలాచారి
హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ను నమ్మలేమని తెలంగాణ సాధించేవరకూ పోరు కొనసాగించాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని, ప్రజలకు అద్భుతమైన స్ఫూర్తి వచ్చిందని అన్నారు. ప్రభంజనంలా ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తోందని, ఇక్కడ కుల మతాలకు చోటు లేదని ఎవరు అడ్డుకున్నా తెలంగాణ ఆగబోదని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ముధోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి ఆదివారం పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ పాలిట ఆంధ్రా వలసవాదులు శాపంగా మారారన్నారు. వలసవాదులు తెలంగాణను దోచుకుంటున్నారు.. దోచుకుంటూనే ఉన్నారని ఆరోపించారు.  వేణుగోపాలాచారి తన చిరకాల మిత్రుడని, ఆదిలాబాద్‌ జిల్లా అద్భుతమైన జిల్లా అని కొనియాడారు. కడెం రిజర్వాయరు కొద్ది పాటి వర్షానికే దొర్లుతోంది. తెలంగాణ కాశ్మీరం ఆదిలాబాద్‌ జిల్లా. జలపాతాలు.. అటవీ ప్రాంతం ఆ జిల్లా సొంతం. అలాంటి జిల్లాలోని ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ 1956 నుంచి మోసం చేస్తూనే ఉన్నదన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే తెలంగాణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని నమ్ముతారని.. అప్పటివరకు నమ్మబోరని అన్నారు. ఆంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమంపై ఎంత దుష్ప్రచారం చేసినా తెలంగాణ ప్రాంత ప్రజల్లో అపోహలు సృష్టించలేరని అన్నారు. మరోమారు కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని అన్నారు. తెలంగాణ వచ్చినా టీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుందన్నారు. తెలంగాణ నిర్మాణంలోనూ విజయభేరి మోగిస్తుందని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ముథోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి అన్నారు. కేసీఆర్‌ ఆమరణదీక్షతోనే కేంద్రం దిగొచ్చిందన్నారు. తెలంగాణ ఏర్పాటు టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. తెలంగాణ సాధించడమే కెసిఆర్‌ ఏకైక ఎజెండా అని ప్రకటించారు. ఉద్యమంలో వెయ్యిమంది మరణించారు. ఏ ఉద్యమంలోనూ అంతమంది చనిపోయిన దాఖలాలు లేవన్నారు. ఇప్పుడు తెలంగాణ రాకుంటే మరెప్పుడూ రాదని అన్నారు. తెలంగాణ ప్రజలతో కాంగ్రెస్‌ బంతాట ఆడుతోందన్నారు. తెలంగాణ సాధన కోసమే తాను టిఆర్‌ఎస్‌లో చేరానని, తెలంగాణను సాధించి తీరుతామని స్పష్టం చేశారు.
ఎవరూ అడ్డుకోలేరు.. : కెకె
తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని టిఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు అన్నారు. కార్యాకర్తల ఆవేదన వల్ల.. త్యాగాల వల్లే తెలంగాణ రావడం తథ్యమన్నారు. ఎవరివల్లో రావడం లేదన్నారు. ప్రజల పోరాటం వల్లే తెలంగాణ వస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తప్పకుండా సాధించి తీరుతామని అన్నారు.