నామినేషన్ల పరిశీలన పూర్తి


12,071 తిరస్కరణ : నవీన్‌మిట్టల్‌
హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) :
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ  సర్పంచు పదవులకు దాఖలైన నామినేషన్లలో 12,071 తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. అలాగే వార్డు సభ్యుల పదవులకు దాఖలైన వాటిల్లో 23,238 నామినేషన్లు తిరస్కరించామని వివరించారు. తిరస్కరణకు గురైన వారు ఆర్డీవోలకు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా ఏదైనా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే అదేరోజు సాయంత్రం ఉప సర్పంచ్‌ ఎన్నికను ఆయా గ్రామ పంచాయతీల్లో నిర్వహించుకోవచ్చని సూచించారు. 23, 27, 31 తేదీల ఎన్నికల సమయం వరకు వేచి ఉండాల్సిన పనిలేదని వివరించారు. సర్పంచ్‌ పదవులకు అత్యధికసంఖ్యలో నామినేషన్లు దాఖలైన జిల్లాగా చిత్తూరు నిలువగా.. అత్యల్ప సంఖ్యలో నామినేషన్లు దాఖలైన జిల్లాగా రంగారెడ్డి నిలిచిందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో 7818 నామినేషన్లు.. రంగారెడ్డిలో 3442 నామినేషన్లు దాఖలయ్యాయని వివరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో విలీనమయ్యే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించవచ్చు అనే హైకోర్టు ఆదేశాలు తమకు అందలేదని, అందాక పరిశీలించి, చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.