రూపాయి బలోపేతానికి


గరిష్టంగా వడ్డీరేటు తగ్గించిన ఆర్‌బీఐ
22 బ్యాంకులకు 49.5 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ/ముంబయి, జూలై 15 (జనంసాక్షి) :
రూపాయి బలోపేతానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో సోమవారం రూపాయి విలువ 33 పైసలు కోల్పోయి రూ.59.89 వద్ద ముగిసిన నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం, ఆర్‌బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు భేటీ అయ్యారు. రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు వాణిజ్య బ్యాంకుల్లో వడ్డీ రేటును 10.25 శాతానికి పెంచారు. అంతేకాక జూలై 18న రూ.12 వేల కోట్ల విలువైన ప్రభుత్వ హామీ పత్రాలను విక్రయించేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది. రూపాయి బలోపేతంతో పాటు ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణ తద్వార నిత్యావసరాల ధరలకు కళ్లెం వేయడమే లక్ష్యంగా ఆర్‌బీఐ చర్యలు ముమ్మరం చేయనుంది. ఎన్నికల ఏడాది కావడంతో ధరల పెంపు ప్రజలపై పెను ప్రభావం చూపి ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయే ప్రమాదముందని గుర్తించిన ప్రధాని ఎట్టకేలకు రూపాయి బలోపేతానికి చర్యలు ఆరంభించారు. అలాగే మనీ ల్యాండరింగ్‌కు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన 22 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ 49.5 కోట్ల జరిమానా విధించింది. ఈ 22 బ్యాంకుల్లో స్టేట్‌బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యెష్‌ బ్యాంకు కూడా ఉన్నాయి. ఇవికాక సిటీబ్యాంక్‌, స్టాండర్డ్‌లాంటి ఏడు బ్యాంకులకు హెచ్చరిక లేఖలు జారీ చేసింది. బ్యాంకులు మనీ ల్యాండరింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆన్‌లైన్‌ పోర్టన్‌ కోబ్రాపోస్ట్‌ పరిశోధనాత్మక కథనం వెలువరించడంతో స్పందించిన ఆర్‌బీఐ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయించింది. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకు రూ.10.5 కోట్ల జరిమానా ఇప్పటికే విధించిన ఆర్‌బీఐ సోమవారం మరో 22 బ్యాంకులకు జరిమానా విధించింది.