ఆ బ్యాట్స్‌మన్‌ ఎవరో చెప్పండి క్లీన్‌బౌల్డ్‌ చేస్తాం


ప్యాకేజీ కావాలని ఎవరు చెప్పారు
తెలంగాణ ఆత్మగౌరవం అమ్మేద్దామనా?
సీఎంపై వీహెచ్‌ ఫైర్‌
హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) :
సమైక్యాంధ్ర కొనసాగించేందుకు వీరోచితంగా బ్యాటింగ్‌ చేస్తున్న బ్యాట్స్‌మన్‌ ఎవరో లగడపాటి వెల్లడిస్తే అతడిని క్లీన్‌బౌల్డ్‌ చేసి తెలంగాణ తెచ్చుకుంటామని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. వెయ్యిమంది చనిపోయాక కలిసుండడం సాధ్యం కాదని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు ఎటువంటి ప్యాకేజీలు వద్దన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. అసలు ప్యాకేజీలు ఎవరడిగారని ప్రశ్నించారు. సీమాంధ్రకే ప్యాకేజీ ఇచ్చి తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండు చేస్తున్నానన్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కెేసీఆర్‌ గురించి అందరికీ తెలిసిందేనన్నారు. ఉద్యమం ఉన్నంతవరకే కేసీఆర్‌ వెలుగు ఉంటుందని అన్నారు. తెలంగాణ వస్తే తన దుకాణం నడవదని కెసిఆర్‌ ఆందోళన చెందుతున్నారన్నారు. తెలంగాణ వస్తే కెసిఆర్‌ వెంట ఆయన కుటుంబం తప్పితే మరెవ్వరూ ఉండబోరని జోస్యం చెప్పారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అంటున్న ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ ఎవరో చెబితే.. తాము మంచి బౌలర్‌ను ఎంపిక చేసుకుంటామని అన్నారు. తెలంగాణను అడ్డుకుంటున్న ఆ బ్యాట్స్‌మెన్‌ ఎవరో చెప్పాలని లగడపాటిని కోరారు. ఎవరో చెబితే ఆయన్ను ఎదుర్కొనే బౌలర్‌ను రంగంలోకి దించుతామన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులను కోరుతున్నానన్నారు. టీవీల్లో ఏదేదో మాట్లాడడం సరైంది కాదన్నారు. అన్నదమ్ముల్లా విడిపోయి కలిసుందాం అన్నారు. విడిపోవడం వల్లే ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం అనడం అవివేకమన్నారు. విభజర కోరేవాళ్లను తరిమి కొట్టాలని అనడం సీమాంధ్ర నేతలకు తగదని అన్నారు. తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రానికి  సీఎం కిరణ్‌ సూచించినట్టుగా వార్తలొస్తున్నాయని.. వాటిల్లో నిజమెంతో తెలుసుకున్నాకే స్పందిస్తానని అన్నారు. తెలంగాణను ఇచ్చేది.. కాంగ్రెస్‌ పార్టీయేనని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టే విషయంలో ఇంకనూ అడ్డుకోవడం తగని, అన్నదమ్ముల్లా విడిపోయి కలిసి ఉందామని హితవు పలికారు. 1969లోనే తెలంగాణవాదులు సీమాంధ్రులను తరిమికొడితే పోయేదన్నారు. తెలంగాణ వారు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే సమస్య రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సంజీవరెడ్డి చెపితే కేంద్రం వింటుందా అని ప్రశ్నించారు. అంతా ఆయన చెప్పినట్లే జరిగితే సోనియాగాంధీ ఎందుకన్నారు. తెలంగాణాకు ప్యాకేజీ ఇవ్వాలని సిఎం చెప్పడం దుర్మార్గమే అవుతుందన్నారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక చిరంజీవి పరిస్థితి ఏవిధంగా తయారైందో ప్రతిఒక్కరికి తెలుసన్నారు. ఇప్పుడు అదీ కాంగ్రెస్‌ పార్టీ దయాదాక్షిణ్యాలతో కేంద్ర మంత్రి పదవి ఇచ్చాక ఆయన ఇంటి వద్ద గిలగిల అంటుందన్నారు. వైఎస్సార్‌ బతికి ఉంటే తెలంగాణ అంశమే తెరపైకి వచ్చేదికాదంటున్న వ్యక్తులకు వాస్తవాలు తెలియడం లేదన్నారు. 2000 సంవత్సరంలోనే వైఎస్‌ ఆధ్వర్యంలోనే సోనియాగాంధీకి తెలంగాణ ఏర్పాటు కోసం నివేదికలు ఇచ్చిన విషయం మరిచిపోవడం దుర్మార్గమన్నారు. వైఎస్‌ ఉన్నా, ఆయన తాత ఉన్నా తెలంగాణ ఏర్పాటు కోసం ప్రజలు ఉద్యమించే వారేనని వీహెచ్‌ పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణా ఇస్తుందన్న నమ్మకం తమకైతే ఉందన్నారు. 2004లో టీఆర్‌ఎస్‌తో కలిసినప్పుడు సీమాంధ్ర నేతలు గడ్డిపీకారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంలో పెట్టినప్పుడు, రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టినప్పుడు, 2009లో మెనిఫెస్టోలో పొందుపరిచినప్పుడు  ఏం చేశారని నిలదీశారు.  అప్పుడు మాత్రం అధికారం అవసరం తెలంగాణ ప్రజలను ఆడుకోవడంతో లబ్ధి పొందాలని కుయుక్తులకు తెరలేపారన్నారు. ఇప్పటికైనా హైకమాండ్‌కు ఇచ్చిన మాటపై నిలబడాలని వీహెచ్‌ సీమాంధ్ర నేతలతో పాటు, ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు.