బ్యాంకులు వడ్డీరేట్లు పెంచవు


ఆర్థిక స్థిరత్వంపై అనుమానాలొద్దు
వృద్ధిరేటు ఆరుశాతం కంటే ఎక్కువే ఉంటుంది
రూపాయి పుంజుకుంటుంది
చిదంబరం ధీమా
జైపూర్‌, జూలై 16 (జనంసాక్షి) :
బ్యాంకులు వడ్డీరేట్లు పెంచబోవని, ఆర్థిక స్థిరత్వంపై అనుమానాలు వద్దని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన అక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సుస్థిరతపై అపోహలు వద్దని, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6 శాతానికంటే ఎక్కువగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం జైపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌తో కలిసి చిదంబరం మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడులు ఆహ్వానించనున్నట్లు చిదంబరం వెల్లడించారు. వృద్ధి రేటు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసమే ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు స్వీకరించనున్నట్లు తెలిపారు. త్వరలో మరోసారి స్పెక్టమ్ర్‌ వేలం వేస్తామని వెల్లడించారు.  రూ.1.61 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. 20 వేల మెగావాట్లకు పైగా విద్యుత్‌ను అదనంగా ఉత్పత్తి చేస్తున్నామన్నారు. బొగ్గు, గ్యాస్‌ ఆధారిత ఎగుమతులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నగదు బదిలీ పథకం ద్వారానే వంటగ్యాస్‌ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ రాయితీని దేశవ్యాప్తంగా ఎక్కడైనా పొందవచ్చన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పర్యావరణ అనుమతులు వెంటనే మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో రైల్వే టారిఫ్‌ అథారిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

బంగారంపై నిషేధం సాధ్యం కాదు..

బంగారంపై మోజు కాస్త తగ్గించుకోవాలని వినయోగదారులకు చిదంబరం సూచించారు. పసిడి కొనే విషయంలో సంయమనం పాటించాలని కోరారు. బంగారం దిగుమతులు మన దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని హరించివేస్తున్న నేపథ్యంలో ఆయనీ సూచన చేశారు. బంగారం దిగుమతులను నిషేధించడం సాధ్యం కాదని చెప్పారు. విదేశాలతో మనం జరిపే లావాదేవీలపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందన్నారు. ‘స్వర్ణంతో భారతీయులకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ప్రస్తుత సమయంలో కొనుగోళ్ల జోలికి వెళ్లకుండా సంయమనం పాటించాలని కోరుతున్నా. 20 గ్రాముల బంగారం కొనేవారు 10 గ్రాములే కొనండి’ అని కోరారు.
ఆహార భద్రతపైనే తొలి చర్చ..
దేశవ్యాప్తంగా 20 శాతం మంది ప్రజలకు ఆహార భద్రతను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆహార భద్రత పథకం అమలుతో ఆకలి, పౌష్టికాహార లోపాలను సరిచేయవచ్చునని తెలిపారు. ఆకలి, పౌష్టికాహార లోపాలను తుదముట్టించాలని భావించే అన్ని రాజకీయ పార్టీలు ఆహార భద్రత బిల్లు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలుపుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆర్డినెన్స్‌ తీసుకురావడంపై బీజేపీ చేస్తున్న విమర్శలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో తొలుత ఆహార భద్రత ఆర్డినెన్స్‌పైనే చర్చ ఉంటుందన్నారు. కేంద్ర బ్యాంకు తీసుకుంటున్న చర్యల వల్ల రూపాయి విలువ బలపడుతుందని చిదంబరం చెప్పారు. రిజర్వ్‌ బ్యాంకు తాజా నిర్ణయం వల్ల బ్యాంకు వడ్డీల రేట్లపై ప్రభావం ఉండబోదన్నారు. రూపాయి విలువ విదేశీ మారక ద్రవ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు. ‘మనం ఎంత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్నా. ఎంత మేర ఖర్చు చేస్తున్నామనే దానిపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని’ చెప్పారు. రూపాయి విలువ పడిపోవడం వల్ల కరెంట్‌ ఖాతా లోటు, ద్రవ్యోల్బణంపైనా ప్రభావం చూపుతోందన్నారు.