జన్యుమార్పిడి పంటలతో వ్యవసాయ విప్లవం


శాస్త్రవేత్తలు అపోహలు తొలగించాలి
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి
కూరగాయల ధరలకు కళ్లెం : శరద్‌పవార్‌
న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి) :
జన్యుమార్పిడి పంటల ప్రవేశంతో వ్యవసాయ విప్లవం వస్తుందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి అన్నారు. ఈ పంటలపై దేశప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై ఉందని ఆయన అన్నారు. పంటలకు సంబంధించిన జాగ్రత్తలు, భద్రతపై స్పష్టత ఇవ్వాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) శాస్త్రవేత్తలను కోరారు. ఐసీఏఆర్‌ 85వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జన్యుమార్పిడి పంటలతో వ్యవసాయరంగంలో విప్లవం తీసుకువచ్చే అవకాశముందని అన్నారు. వీటివల్ల ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా భద్రతపై భరోసా ఇవ్వాలని అన్నారు. ఆహార లోటు నుంచి ఆహార మిగులు స్థాయికి భారత్‌ చేరుకుందని అన్నారు. అదే సమయంలో వాతావరణంలో మార్పుల వల్ల వ్యవసాయానికి రంగానికి ఎదురవుతున్న సవాళ్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాతావరణ ప్రతికూల అభివృద్ధి విధానంపై దేశం కసరత్తు చేయాలని తెలిపారు. గత రెండు దశాబ్దాల్లో దేశం రెండు తీవ్ర కరువులు చవిచూసినా వ్యవసాయ ఉత్పత్తి బాగానే ఉందని చెప్పారు. ధాన్యం ఉత్పత్తి 200 మిలియన్‌ టన్నులు దాటిపోయామని చెప్పారు. రెండు హెక్టార్లలోపు చిన్న కమతాలు గల రైతులు పూర్తిస్థాయిలో ఉత్పత్తి సాధించేలా చేయాలని, ఇందుకుగాను తక్కువ ఖర్చు, తక్కువ బరువు, బహుళ ప్రయోజనకరమైన వ్యవసాయ పనిముట్లను అభివృద్ధి చేయాలని అన్నారు. పరిశోధన సంస్థలు విద్యుత్‌, సౌర విద్యుత్‌తో పనిచేసే వ్యవసాయ ఉపకరణాలను అభివృద్ధి చేయాలన్నారు. వ్యవసాయేతర రంగాల్లో ఒక వృద్ధి కంటే వ్యవసాయ రంగంలో ఒకశాతం వృద్ధి పేదరిక నిర్మూలనకు రెండు, మూడు రెట్లు ఎక్కువగా దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణం గురించి తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిసాన్‌ ఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌ను ప్రణబ్‌ముఖర్జీ ప్రారంభించారు. రైతులు కిసాన్‌ కాల్‌ సెంటర్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-180-1551కు ఫోన్‌ చేసి ఫోన్‌ నంబర్‌ నమోదు చేసుకుంటే వెబ్‌ పోర్టల్‌ నుంచి నేరుగా సమాచారం పొందవచ్చని సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ మాట్లాడుతూ, జన్యుమార్పిడితో కూరగాయల ధరలకు కళ్లెం వేయవచ్చని అన్నారు. కిసాన్‌ వెబ్‌పోర్టల్‌ సమాచారాన్ని అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు.