బీహార్‌లో ఘోరం వికటించిన మధ్యాహ్న భోజనం


11 మంది మృతి
పాట్నా, జూలై 16 (జనంసాక్షి) :
బీహార్‌లో ఘోరం జరిగిపోయింది. మధ్యాహ్న భోజన పథకం కింద వడ్డించిన ఆహారం విషమై 11మంది చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. దీని ప్రభావం వల్ల మరో 48మంది అస్వస్థతకు గురయ్యారు. బీహార్‌లోని సరన్‌ జిల్లాలోని దహ్రమసాటి గందవాన్‌ అనే గ్రామంలో మంగళవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం చిన్నారులకు అన్నం, పప్పు, సోయాబీన్‌తో కూడిన ఆహార పదార్థాలను వడ్డించారు. ఇది తిన్న వెంటనే వారు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చాప్రా సదర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 11 మంది విద్యార్థులు విగతజీవులయ్యారు. మిగతావారు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ అత్యున్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. సరన్‌ డివిజన్‌లో కమిషనర్‌, డీఐజీ దీన్ని సంయుక్తంగా చేపడతారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. దర్యాప్తులో ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ బృందం సాయపడుతుందని వివరించింది. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఛాప్రా ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ దుర్ఘటనపై పరిశీలన జరపడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఓ సీనియర్‌ అధికారిని పంపింది. మరోపక్క ఈ విషాద ఘటనపై భాజపా విచారం వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద అందిస్తున్న ఆహారంపై లోగడ కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ ప్రధాన మురళీధర్‌ రావు కోరారు.