బడికెళ్లస్తడనుకుంటే బతుకే చాలించిండు


బువ్వే విషమై కాటేసింది
బిడ్డా! ఇక మేమేట్ల బతకాలే
మిన్నంటిన రోదనలు
22కు చేరిన బీహార్‌ మృతులు
చాప్రా/పాట్నా, జూలై 17 (జనంసాక్షి) :
‘నువు లెక్కలు చదువుతుంటే పెద్దయినంక ఎంతో ఎదిగి మా కష్టాలు తీరుస్తవనుకున్నం. అందరి ముందు తలెత్తుకు తీరిగేలా చేస్తావనుకున్నం.  ఊరోళ్లందరూ నీ కొడుకు చదువు లో ఫస్ట్‌ అంటే ఎంతో మురిసిపోయినం. రోజూ చకచకా బడికిపోయి వచ్చి ఇంట్లో పనికి సాయపడే నీ ఓపిక చూసి చచ్చినీకడుపునే పుట్టాలనుకున్నం. నీకు పగటి తిండిపెట్టలేకున్నా సర్కారే బువ్వ పెట్టి చదువు చెప్తుందని సంబరపడ్డం. అదే బువ్వ విషమై నిను బలితీసుకుంటుందని అనుకోలేదు బిడ్డా! అంటూ బీహార్‌లో కలుషితాహారం తిని మృత్యువాతపడిన చిన్నారి తల్లిదండ్రులు చాప్రా ఆస్పత్రిలో గుండెలవిసేలా రోదించారు.
‘ఉన్న ఇద్దరు బిడ్డలను బాగా చదివించాలనుకున్న. దానికి నా పేదరికం అడ్డం వత్తదని సర్కారు బడికే పంపిన. సర్కారు బల్లె పెట్టే అన్నం తిని వాళ్లిద్దరూ చచ్చిపోయిండ్రు. చిన్నప్పుడు వాళ్లను ఇదే భుజాలపై ఎత్తుకొని పెంచినా. గుండెలపై ఆడుకుంటుంటే ఎంతో సంబరపడిన. ఇప్పుడు వారి శవాలను అదే గుండె హత్తుకొని, భుజాలపై మోసుకొని వస్తున్న’ అని మరో తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు.
చదువుల కోవెల పాఠశాల మృత్యు ఘంటికలు మోగించింది. నిరుపేద కుటుంబాల పిల్లలను చదువు వైపునకు ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం విషమైపోయింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది చిన్నారులను పొట్టనబెట్టుకుంది. ఇన్నాళ్లు చిన్నారుల కేరింతలు, ఆటపాటలతో కళకళలాడిన బడి ఒడిలో తీవ్ర విషాదాన్ని నింపింది. యావత్‌ భారాతాన్నే నివ్వెర పరిచింది. మధ్యాహ్న భోజనం తిని విగత జీవులైన చిన్నారుల మృతదేహాలను చూసి కంటతడి పెట్టని హృదయం లేదు. సర్కారు నిర్లక్ష్యమో, దుష్టశక్తులు పన్నిన కుట్రో మొత్తానికి 22 కుటుంబాల ఇంటి వెలుగులను చిదిమేసింది.
బీహార్‌లోని సరన్‌ జిల్లా దహ్రమసాటి గందవాన్‌ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం వడ్డించిన భోజనం వికటించి 11 మంది మృత్యువాత పడగా, మరో 48 మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య గురువారానికి 22కు చేరింది. చాప్రాలోని సదర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరికొందరు పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. పిల్లలు తీసుకున్న ఆహారంలో విషం కలిసిందన్న విషయం  ప్రాధమిక విచారణలో తేలిందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పికె షాహి తెలిపారు. బుధవారం ఆయన  విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులను వివరాలడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. పూర్తి నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదెలా జరిగిందన్న కోణంలో విచారణ కొనసాగు తోందన్నారు. మృతులంతా పదేళ్లలోపువారే. మరో 29 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది.
చాప్రాలో ఉద్రిక్తం
విద్యార్థుల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ చాప్రాలో బిజెపి, ఆర్‌జెడి నేతలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ నేపథ్యంలో చాప్రాలో హింసాత్మకం చోటు చేసుకుంది. ఆందోళనకారులు స్కూళ్లను, వాణిజ్య సముదాయాలను మూయించివేశారు. రోడ్లపై ఉన్న పలు వాహనాలను ధ్వంసం చేశారు. దుకాణాల షట్టర్లను పగులగొట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేసి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.