కాశ్మీర్‌లో జవాన్ల కాల్పులు


ఆరుగురి మృతి.. పలువురికి గాయాలు
విచారణకు ఆదేశించిన షిండే
శ్రీనగర్‌, జూలై 18 (జనంసాక్షి) :
జమ్మూకాశ్మీర్‌లో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ జవాన్లు రెచ్చిపోయారు. రంబాన్‌ జిల్లాలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు సాధారణ పౌరులు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఈ దాడిని నిరసిస్తూ మానవ హక్కుల సంఘాలు, జేకేఎల్‌ఎఫ్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. జేకేఎల్‌ఎఫ్‌ చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ రోడ్డుపైకి వచ్చి జవాన్ల దుశ్చర్యను ఖండించారు. బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కాల్పులపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. జవాన్లు బాధ్యతారహితంగా వ్యవహరించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.