సోనియా, షిండేతో నాదెండ్ల భేటీ


తెలంగాణ తీర్మానంపై చర్చ
న్యూఢిల్లీ, జూలై 18 (జనంసాక్షి) :
తెలంగాణపై హస్తినలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన స్పీకర్‌.. గురువారం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెడతారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన మనోహర్‌ గురువారం ఉదయం అధినేత్రితో సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ అంశంపైనే చర్చించినట్లు తెలిసింది. తెలంగాణపై తీర్మానం పెడితే పరిస్థితి ఏమిటని సోనియా ఆరా తీసినట్లు సమాచారం. తీర్మానం పెడితే ఎవరి బలం ఎంత? ఏ పార్టీ అనుకూలం, ఏ పార్టీ వ్యతిరేకం, మద్దతిచ్చే వారెవరు? తీర్మానం ఆమోదం పొందుతుందా? వీగిపోతుందా? అంటూ అధినేత్రి పలు ప్రశ్నలు వేసినట్లు పార్టీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తీర్మానం పెడితే ఎంత మంది హైకమాండ్‌ను ధిక్కరించే అవకాశముందని ఆరా తీసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్తితులతో పాటు విభజన అంశంపై మనోహర్‌ సోనియాకు ఓ నివేదిక అందజేసినట్లు సమాచారం. సోనియాతో భేటీకి ముందు స్పీకర్‌ కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను కలిశారు. ఈ భేటీలోనూ తెలంగాణ తీర్మానంపైనే చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ అంశాన్ని కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా హైకమాండ్‌ చేస్తున్న కసరత్తులో భాగంగా మనోహర్‌తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.