తెలంగాణ కోసం ఎర్రజెండాల ఐక్యపోరాటం


ఐదు వామపక్ష పార్టీల నిర్ణయం
28న భారీ సదస్సు : నారాయణ
హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీపీఐతో పాటు మరో నాలుగు వామపక్ష పార్టీలు ఉద్యమం తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున బండ సుధాకర్‌, న్యూడెమోక్రసీ కృష్ణ, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ తరఫున వెంకటస్వామి, సీపీఐ లిబరేషన్‌ తరఫున ఎన్‌.మూర్తి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ సాధన కోసం భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించారు. అనంతరం సీపీఐ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అంశాన్ని అధికార కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఐదు వామపక్ష పార్టీలు నిర్ణయించాయని తెలిపారు. ఈ పార్టీలు ఎన్నికల పొత్తు కోసం కాదని, ఉద్యమంలో భాగస్వాములై ఉద్యమిస్తాయని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ కోసం ఎన్నో కమిటీలు, అఖిలపక్ష సమావేశాలు నిర్వహించినా ఎటూ తేల్చులేకపోయావని విమర్శించారు. రాజకీయ అంశాన్ని   తేల్చకుండా నాన్చడంతో సమస్య మరింత జటిలం అవుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ కోర్‌కమిటీ తెలంగాణ సమస్యను తేల్చకపోవడం విచారకరమని చెప్పారు. ఈ సమావేశంలో మూడు ప్రాంతాల నేతలు మూడు రకాలుగా చెబితే విని సీడబ్ల్యుసీకి అప్పగించడం పచ్చి అవకాశవాద రాజకీయమని నారాయణ విమర్శించారు. ఇరుప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టి వైషమ్యాలను పెంపొందిస్తోందని, అసంతృప్తులను దగ్గరకు తీసుకునేందుకు కాంగ్రెస్‌ కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. రాయల తెలంగాణ, ప్యాకేజీలను ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. హైదరాబాద్‌ మొదటి నుంచీ తెలంగాణ ప్రాంతంలోనిదేనని స్పష్టం చేశారు. విభజన జరగాల్సి వస్తే సీమాంధ్రకు కొత్తరాజధాని ఏర్పాటయ్యేంత వరకు తాత్కాలికంగా రాజధానిగా ఉంచిన ఫర్వాలేదన్నారు. ఇందిరాగాంధీ వాదనలను లేవనెత్తుతున్న కాంగ్రెస్‌.. నెహ్రూ వాదనలను ఎందుకు లేవనెత్తడం లేదని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఈ ఐదు వామపక్ష పార్టీలు ఈ నెల 28న భారీ సదస్సు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ సదస్సులో భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్‌ఎస్‌తో కానీ, జేఏసీతో కానీ ఎలాంటి విభేదాలులేవని, అవసరమైతే వాటితో కలసి పనిచేస్తామని నారాయణ స్పష్టం చేశారు.