‘నీట్‌’కు సుప్రీం నో


నోటిఫికేషన్‌ చెల్లదంటూ సంచనల తీర్పు
ఉమ్మడి పరీక్ష నిర్వహించే అధికారం లేదు
పాత పద్ధతే కొనసాగించండి : సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, జూలై 18 (జనంసాక్షి ) :
మెడికల్‌ ప్రవేశాలపై సందిగ్ధత తొలగిపోయింది. ఎంసెట్‌ కొనసాగింపుపై ఉన్న ఉత్కంఠ కూడా వీడింది. మెడిసిన్‌ ప్రవేశాలకు ఎంసెట్‌ ఉంటుందా? లేదా? అన్న అనుమానాలకు తెర పడింది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) నోటిఫికేషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి, వైద్యవిద్య ప్రవేశాలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్‌ వేసింది. నీట్‌ నోటిఫికేషన్‌ చెల్లదని స్సష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం నీట్‌ నిర్వహించే అధికారం భారత వైద్య మండలి (ఎంసీఐ)కి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష కోసం ఎంసీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌ చట్టవిరుద్ధమని ప్రకటించింది. రాష్టాల్రు వైద్య విద్య ప్రవేశ (మెడికల్‌ ఎంట్రెన్స్‌) పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఇద్దరు జడ్జిలు నీట్‌కు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆల్తామస్‌ కబీర్‌, జస్టిస్‌ విక్రమ్‌జిత్‌ సేన్‌ నీట్‌ చట్టవిరుద్ధమని తీర్పునివ్వగా, ఇదే బెంచ్‌లోని మరో సభ్యుడు జస్టిస్‌ అనిల్‌రమేశ్‌ దవే ఉమ్మడి ప్రవేశ పరీక్ష చట్టబద్ధమని ప్రకటించారు. త్రిసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు నీట్‌ను కొట్టివేయడంతో జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష రద్దయింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించే అధికారం ఎంసీఐకి స్పష్టం లేదని ధర్మాసనం తెలిసింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్రంలో ఎంసెట్‌ ద్వారానే ప్రవేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారానే వైద్య విద్య ప్రవేశాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌లలో ప్రవేశాలకు తప్పనిసరిగా జాతీయ అర్హత ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించి మెడిసిన్‌, డెంటల్‌ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎంసీఐ నీట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే, నీట్‌ నిర్వహణపై పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్‌ కళాశాలలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ మేరకు వివిధ అభ్యంతరాలు తెలుపుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై దాదాపు రెండేళ్ల పాటు సుదీర్ఘ విచారణ కొనసాగింది. అయితే, విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సిన తరుణంలో పలు రాష్టాల్రు సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకువచ్చాయి. ఎంసెట్‌ నిర్వహణకు అనుమతించాలని విజ్ఞప్తి చేశాయి. రాష్టాల్ర విజ్ఞప్తిని పరిశీలించిన ధర్మాసనం.. నీట్‌తో పాటు వివిధ రాష్టాల్రు విడిగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకొనేందుకు అనుమతిచ్చింది. అయితే, ఫలితాలను మాత్రం వెల్లడించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎంసెట్‌ నిర్వహించింది. కోర్టు ఆదేశాల మేరకు ఫలితాలు వెల్లడించలేదు. అయితే, గురువారం తుది తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు.. ప్రవేశాలు నిర్వహించుకొనేందుకు ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అడ్మిషన్లు కొనసాగించాలని సూచించింది. పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్‌కు అనుమతి
పద్ధతిలోనే కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది. నీట్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తుది తీర్పు వెల్లడించింది. నీట్‌ను నిర్వహించే అధికారం ఎంసీఐకి లేదని చీఫ్‌ జస్టిస్‌ ఆల్తామస్‌ కబీర్‌, జస్టిస్‌ విక్రమ్‌జిత్‌ సేన్‌ స్పష్టం చేయగా, జస్టిన్‌ అనిల్‌ దవే మాత్రం వారితో విభేదించారు. వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ నిర్వహణ చట్టబద్ధమేనని పేర్కొంటూ, ప్రైవేట్‌ మెడికల్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చారు.