పోలీస్‌ కాల్పులకు నిరసనగా కాశ్మీర్‌లో ఆందోళనలు


కొనసాగుతున్న కర్ఫ్యూ
స్తంభించిన జనజీవనం
శ్రీనగర్‌, జూలై 20 (జనంసాక్షి) :
జమ్మూకాశ్మీర్‌లోని రాంబస్‌ జిల్లాలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరుల మృతికి నిరసనగా, శుక్రవారం జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. భద్రతా దళాలు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఆందోళనల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. జమ్మూ నుంచి అమర్‌నాథ్‌ యాత్రనూ నిలిపేశారు. ఇక్కడి నుంచి 22 బృందాలు అమర్‌నాథ్‌ వెళ్లాల్సి ఉంది. గురువారం కాల్పుల ఘటనకు సంబందించి పౌరుల ఫిర్యాదు ఆధారంగా బీఎస్‌ఎఫ్‌, కొందరు పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు స్థానిక పోలిసులు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలిసులు శ్రీనగర్‌-జమ్ము జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపేశారు. గండెర్బల్‌ ప్రాంతంలోని ఖురామా గ్రామంలో అందోళకారులు పెద్దఎత్తున వీధుల్లోకి రాగా వారిని అదుపు చేసేందుకు పోలిసులు రబ్బరు తూటాలు, భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. భద్రతాదళాలు గాల్లోకి కాల్పులు జరిపాయిజ ఈ ఘటనలో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఇక్కడే కాకుండా జమ్ములోని పలు ప్రాంతాల్లో భద్రతాదళాలు, అందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పౌరులపై బీఎస్‌ఎఫ్‌ కాల్పులకు నిరసనగా హురియత్‌ శుక్రవారం నుంచి మూడు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.